రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యకు అనిశా కస్టడీ ముగిసింది. వారిద్దరినీ రెండు రోజుల కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరి దగ్గర లంచాలు స్వీకరించారు అనే కోణంలో ప్రశ్నించారు.
దర్యాప్తునకు సహకరించని లావణ్య
మొదటి రోజు ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయిన లావణ్య రెండో రోజు మాత్రం ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు వంటి జవాబులు చెప్పటం వల్ల అధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. అయితే కొందుర్గు వీఆర్వో అనంతయ్య మాత్రం ఆమె అక్రమాల చిట్టా విప్పినట్టు తెలుస్తోంది. ఏదైనా పనిమీద తహసీల్దార్ కార్యాలయానికి వస్తే వదిలిపెట్టకుండా ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసేదని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.