రెవెన్యూ శాఖలో ఖాళీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండగా అదేస్థాయిలో భర్తీలు లేకపోవడం ఇందుకు మరో కారణం. డిప్యూటీ తహసీల్దారు నుంచి ఆపై క్యాడర్ వరకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు మూడేళ్లుగా ముందడుగు పడలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 95 డిప్యూటీ కలెక్టర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులోపు పదవీ విరమణ చేస్తున్న 23 మందితో కలిపి ఆ సంఖ్య 118కు చేరుకోనుంది. రాష్ట్రంలో 25 స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల స్థానాలు, 77 తహసీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దారు నుంచి పదోన్నతుల ద్వారా వీటిని పూరించాల్సి ఉంది.
కొన్నేళ్లుగా డిప్యూటీ తహసీల్దారు నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వరకు నిర్వహించాల్సిన పదోన్నతుల కల్పన ప్రక్రియ జరగడం లేదు. డిప్యూటీ కలెక్టర్ల (ఆర్డినరీ) నుంచి స్పెషల్ గ్రేడ్‌కు 2018 ఫిబ్రవరిలో చివరిసారిగా 20 మందికి పదోన్నతులు కల్పించారు. గతేడాది నవంబరులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య అనంతరం రెవెన్యూ సంఘాల విజ్ఞప్తి మేరకు పదోన్నతులు, ఖాళీల భర్తీ చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. నేటికీ కార్యాచరణ రూపుదాల్చలేదంటూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.