ఐఎంఎస్ మందుల కుంభకోణంలో దేవికారాణి భర్త గురుమూర్తిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. దేవికారాణి తరపున ఔషధ పరిశ్రమ నుంచి లంచాలు తీసుకున్న నిందితుడిని... అనిశా న్యాయస్థానంలో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బీమా వైద్యసేవల విభాగం కుంభ కోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న దేవికా రాణి సుమారు 100 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్, కడప, తిరుపతిలో దేవికా రాణి కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. భారీగా స్థిరచరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలన్నింటిని అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవికా రాణి, ఆమె భర్త గురుమూర్తిపై అనిశా అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
32 ఎకరాల పొలం.. 23 బ్యాంకు ఖాతాలు:
సివిల్ సర్జన్‌గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి... దేవికారాణి అక్రమాలకు సహకరించినట్లు అనిశా అధికారులు తేల్చారు. దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి లంచాలు తీసుకున్న గురుమూర్తి.... స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు, 32 ఎకరాల పొలం, తెలుగు రాష్ట్రాల్లో 11 ఇంటి స్థలాలు, వైజాగ్‌లో సొంత ఇల్లు, హైదరాబాద్‌లో 16 వాణిజ్య దుకాణాలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.
23 బ్యాంకు ఖాతాల్లో కోటి 13లక్షల నగదు, నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో రూ.34 లక్షల డిపాజిట్, నిర్మాణ రంగంలో రూ.6.63కోట్ల పెట్టుబడులు, ఇంట్లో రూ.8లక్షల నగదు గుర్తించారు.
దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ రూ.38 లక్షలు:
షేక్ పేట విల్లాలో నివాసం ఉంటున్న దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ రూ.38 లక్షలు, 26లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 7లక్షల రూపాయల ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. హైదరాబాద్‌లో షేక్ పేటలో విల్లా, 3 ఫ్లాట్లు, సోమాజిగూడలో ఫ్లాటు, రాజేంద్రనగర్‌లో సొంత ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు గుర్తించారు.
ఇవీ చూడండి:దిశ సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు