తెలంగాణ

telangana

ETV Bharat / state

Govt Hospitals Covid Treatment: సర్కార్ దవాఖానాల్లో మెరుగైన కొవిడ్ చికిత్స - Telangana govt hospitals

Govt Hospitals Covid Treatment: తొలి రెండు దశల్లో వందల జీవితాలను కొవిడ్‌ విషాదమయం చేసింది. రెండోదశలో వేలమందిని అప్పుల పాలు చేసింది. రూ.లక్షలు ఖర్చుపెట్టినా అయినవారిని దక్కించుకోలేని దుస్థితి ఎందరికో ఎదురైంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సకోసం చేసిన అప్పులను ఇప్పటికీ చెల్లిస్తున్న వారు ఉన్నారు. మూడోదశ ముంచుకొస్తున్న నేపథ్యంలో.. అటువంటి పరిస్థితులు మళ్లీ ఎదురైతే.. తట్టుకోవడం సాధారణ  కుటుంబాలకు ఆర్థికంగా కష్టమే. ఈ క్రమంలో సర్కారు దవాఖానాల్లో వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. నిరంతర ప్రాణవాయువు సరఫరాతో పాటు రెమ్‌డెసివిర్‌ వంటి అధునాతన ఔషధాలు కూడా ప్రభుత్వ వైద్యంలో సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై 'ఈనాడు- ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం

Covid TreatmeGovt Hospitals Covid Treatment:nt
Covid TreatmentGovt Hospitals Covid Treatment:

By

Published : Jan 14, 2022, 5:31 AM IST

Govt Hospitals Covid Treatment: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ మూడో ఉద్ధృతిని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానాలను సర్వసన్నద్ధం చేసింది. 112 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 27,996 పడకలకు గాను ఇప్పటికే 25,390 బెడ్‌లకు ప్రాణవాయువు సౌకర్యం కల్పించింది. మరో వారం రోజుల్లో మిగిలిన వాటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ స్వీయ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పింది. గతంలో రోజుకు 137 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. దీని సామర్థ్యాన్ని 327 మెట్రిక్‌ టన్నులకు పెంచింది.

ఆక్సిజన్ సిద్ధం...

27 కంటైనర్ల ద్వారా 540 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న ప్రాణవాయువును సిద్ధంగా ఉంచింది. అన్ని సర్కారు దవాఖానాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా 5,200 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని.. ఇక్కడి 6 ఆసుపత్రుల్లో అదనంగా 792 పడకలను నెలకొల్పి, వాటికి ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది.

మౌలిక వసతులు కల్పించినా...

Gandhi Hospital Covid Treatment: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సమృద్ధిగా కల్పించినా.. చికిత్స అందించేది మాత్రం వైద్యులు, నర్సులే. వీరిని సరైన రీతిలో వినియోగించడంలోనే వైద్యశాఖకు అసలు సిసలు సవాల్‌ ఎదురుకానుంది. బోధనాసుపత్రుల్లో కొంతమేరకు వైద్యుల సేవల్లో ఇబ్బందులు లేకపోయినా.. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులకొచ్చేసరికి కొంతమందిపైనే పూర్తి భారం పడుతోంది. ఈ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలో కీలకంగా వ్యవహరించే పల్మనాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. వీటిల్లో జనరల్‌ మెడిసిన్‌, మత్తు వైద్యులు కూడా ఒక్కో ఆసుపత్రిలో ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కేసుల సంఖ్య పెరిగినప్పుడు.. అధిక భారం వీరిపైనే పడే అవకాశాలున్నాయి. రానున్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రుల వారీగా సమీక్ష నిర్వహించి, నిపుణుల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది.

కొరత ఎదురయ్యే ప్రమాదం...

హైదరాబాద్‌, పరిసర ఆసుపత్రుల్లో ఎక్కువమంది నిపుణులున్నారు. వీరిని అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయకపోతే.. కేసులు తీవ్రమైనప్పుడు వైద్యుల కొరత ఎదురయ్యే ప్రమాదముంది. కేసుల సంఖ్య పెరిగినప్పుడు.. కేవలం జనరల్‌ మెడిసిన్‌ వైద్యులపైనే భారం వేయకుండా ఇతర విభాగాల వైద్యులను కూడా కొవిడ్‌ సేవల్లో వినియోగించుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల జోన్ల మార్పిడిలో భాగంగా నర్సులు కూడా పెద్దసంఖ్యలో అటూఇటూ మారిపోయారు. దీన్ని కూడా సరైన రీతిలో సర్దుబాటు చేయకపోతే.. కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువమంది నర్సులతో, మరికొన్ని చోట్ల తక్కువమందితో సేవలందించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ నాణ్యమైన వైద్యం

మొదటి, రెండోదశలను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం గాంధీ ఆసుపత్రి వైద్యులకుంది. ఇది మూడోదశను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడుతోంది. ప్రస్తుతం కొవిడ్‌, కొవిడేతర రోగులకు కూడా చికిత్స అందిస్తున్నాం. మూడోదశ ఉద్ధృతిని బట్టి కొవిడ్‌ చికిత్సకు పడకల సంఖ్య పెంచుతాం. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని విభాగాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలో ప్రాణవాయువు కొరత లేకుండా 20వేల లీటర్లు, 6వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిల్వ చేసే ప్లాంట్లున్నాయి. ఇవి కాకుండా నిమిషానికి 1000 లీటర్ల ప్రాణవాయువును ఉత్పత్తి చేసే రెండు ప్లాంట్లు సేవలందిస్తున్నాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మరో 6 ఆక్సిజన్‌ ప్లాంట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.

-- డాక్టర్‌ రాజారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

వైద్యులకు కొరత లేదు

-డాక్టర్‌ విమల థామస్‌, టిమ్స్‌ సంచాలకులు

లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారిలో కొవిడ్‌ సోకినా.. లక్షణాలు తీవ్రంగా ఉంటే అప్పుడు వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అవసరం. టిమ్స్‌లో సరిపోను రీతిలో వైద్యులు, నర్సులున్నారు. రోజుకు 21వేల లీటర్ల సామర్థ్యమున్న లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ప్లాంటుంది. 3 స్వీయ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఒక దాంట్లో రోజుకు 1000 లీటర్లు, మరో దాంట్లో రోజుకు 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు. మూడో దాంట్లో 300 లీటర్ల ఆక్సిజన్‌ను రోజుకు ఉత్పత్తి చేయొచ్చు.

అన్ని పడకలకూ ఆక్సిజన్‌

-డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఎంజీఎం సూపరింటెండెంట్‌

గత అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఆసుపత్రిలో అన్ని పడకలకూ ఆక్సిజన్‌ అందిస్తున్నాం. ప్రస్తుతం 10వేల లీటర్లు, 13వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు రెండున్నాయి. ఇవి కాకుండా స్వీయ ప్రాణవాయువు ఉత్పత్తి ప్లాంట్లు మరో 2 వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు కేసులు పెరిగినా ప్రాణవాయువుకు ఎటువంటి కొరత ఉండదు. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా 15 వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాం. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత లేదు. అవసరాలకు తగ్గట్లుగా సహాయ ఆచార్యులను ఒప్పంద ప్రాతిపదికన నియమించాం. త్వరలో మరో 72 మంది సీనియర్‌ రెసిడెంట్లను తీసుకోనున్నాం.

మరికొందరి మాట

1. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 12 ఐసీయూ, 30 ఆక్సిజన్‌ పడకల్ని అత్యవసర సేవల కింద ఏర్పాటు చేశాం.

-డాక్టర్‌ రత్నమాల, సూపరింటెండెంట్‌, కరీంనగర్‌ ఆసుపత్రి

2. ఇటీవలే 24 మంది ప్రత్యేక నిపుణులను తీసుకున్నాం. 40 మంది స్టాఫ్‌నర్సులను తీసుకునేందుకు అనుమతించారు. కొంత డ్యూటీ వైద్యుల కొరత ఉంది. దీన్ని కూడా అధిగమిస్తాం.

-డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, ఖమ్మం ఆసుపత్రి

3. కేర్‌ ఇండియాకు సంబంధించిన 53 మంది సాంకేతిక నిపుణులు, ల్యాబ్‌టెక్నిషియన్స్‌, పారిశుద్ధ్య కార్యకర్తలు సేవలందిస్తున్నారు. గర్భిణులకు పాజిటివ్‌ వస్తే చికిత్స కోసం ప్రత్యేక పడకలున్నాయి.

-డాక్టర్‌ రమేశ్‌, సూపరింటెండెంట్‌, మహబూబ్‌నగర్‌ ఆసుపత్రి

4. మొత్తం 99 మంది హౌస్‌సర్జన్‌లతో కలిపి 328 మంది వైద్యులు, 229 మంది నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. కార్పొరేట్‌ స్థాయిని మించిన వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది.

-డాక్టర్‌ ప్రతిమారాజ్‌, సూపరింటెండెంట్‌, నిజామాబాద్‌ ఆసుపత్రి

ఇదీ చూడండి: Telangana Corona Cases: రాష్ట్రంలో 2707 మందికి కొవిడ్ పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details