తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే... కార్పొరేట్​ సంస్థలదే హవా'

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల వల్ల వ్యవసాయ రంగం మరింత తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడమే కాదు ప్రజాపంపిణీ వ్యవస్థ మీద, ఆహారభద్రత పైన తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అభిప్రాయపడ్డారు.

'కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే... కార్పొరేట్​ సంస్థలదే హవా'
'కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే... కార్పొరేట్​ సంస్థలదే హవా'

By

Published : Dec 21, 2020, 7:27 AM IST

Updated : Dec 21, 2020, 8:06 AM IST

రైతుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠపరచడం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం కాకుండా కార్పొరేట్లకు పూర్తిగా అప్పజెప్పడం వల్ల రైతుల పరిస్థితి ప్రత్యేకించి సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని పాలగుమ్మి సాయినాథ్ అన్నారు.

రెండున్నర దశాబ్దాలుగా వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల గురించి లోతైన అధ్యయనం చేసిన సాయినాథ్‌ కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టాల ప్రభావం ఎలా ఉంటుందో ‘ఈటీవీ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు కేంద్రం చెబుతోంది. కొత్త చట్టాల వల్ల అది జరగదంటారా?

జ: పంటలకు ఐదు రెట్లు పెట్టుబడి వ్యయం పెరిగితే అన్నదాతల ఆదాయం ఎలా రెట్టింపవుతుంది. ఇది అసాధ్యం. గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం సరాసరి రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ.6426. పంజాబ్‌, కేరళలలో ఎక్కువ కాబట్టి సగటు ఇలా ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ మరీ ఎక్కువ కాదు, సుమారు రూ.10 వేలు. రైతుల ఆదాయానికి సంబంధించి కొత్త సమాచారాన్ని కేంద్రం బయటకు రానీయడం లేదు. తక్కువ ఆదాయంతో ఎలా బతకాలో దిక్కుతోచక రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని మరింత ఇబ్బందులకు గురిచేసేలా కొత్త చట్టాలు తెచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచకుండా రైతుల ఆదాయం పెరగదు. అలాంటిది పూర్తిగా కార్పొరేట్లకు అప్పగిస్తే ఎలా సాధ్యమవుతుంది. అనేక అధ్యయనాలు చెబుతున్నది ఏమిటంటే ప్రైవేటు వ్యాపారులు కొనేదానికంటే ఏపీఎంసీ (వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీ)లలో 19 శాతం ధర ఎక్కువగా వస్తుంది. చిన్న వ్యాపారులైతే రైతులు కొంతైనా మాట్లాడగలరు. బడా కార్పొరేట్‌ సంస్థలతో రైతులు ఎలా సంప్రదింపులు జరుపుతారు. సన్న, చిన్నకారు కాదు ఓ మాదిరి పెద్ద రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది.

కేంద్రం తెచ్చిన చట్టాల ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది.. రైతుల్ని ఆదుకునేలా ఉండవా?

జ: వ్యవసాయ సంక్షోభాన్ని మరో దశకు తీసుకెళ్తాయి. త్వరలోనే ప్రజాపంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. నిర్వీర్యానికి దారి తీస్తుంది. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) పైనా ప్రభావం పడుతుంది. కొత్త చట్టాల వల్ల ప్రైవేటు కార్పొరేట్లది ప్రధాన వ్యాపారం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది తమ ఇంటి దగ్గర లేదా సమీపంలోని మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. స్థానిక మార్కెట్‌లో రెండు రోజులు ఎదురుచూడాల్సి వస్తేనే అనేక ఇబ్బందులు పడతారు. రైతుకు అప్పు ఇచ్చినవారు.. పంట చేతికి రాకముందే కాచుకొని కూర్చొంటారు. అందుకే త్వరగా అమ్మేసి వాళ్లకు ఇచ్చేద్దామనుకొంటారు. అలాంటిది మంచి ధర వచ్చేవరకు ఎదురుచూడటం, ఎక్కడ ధర వస్తే అక్కడకు వెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనికాదు. దేశంలో 29 శాతం వరి, 44 శాతం గోధుమను వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇక్కడ ఓ ధర ఉంది కాబట్టి బయట కూడా దాని ప్రభావం ఉంటుంది. దేశంలో 23 పంటలకు కనీస మద్దతు ధర ఉన్నా రెండుమూడు పంటలు మినహా మిగిలినవి ఎక్కువగా కొనడం లేదు. బిహార్‌లో 2006లో ఏపీఎంసీలు రద్దయ్యాయి. ఆ రాష్ట్రంలోని రైతుకు సగం ధర కూడా రావడం లేదు. వీటన్నింటి వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారభద్రత సమస్యగా మారుతుంది. దీనివల్ల ఆకలి సమస్య తీవ్రమవుతుంది. ప్రజారోగ్యంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కొత్త చట్టాల వల్ల వ్యవసాయం, రైతులపైనే కాదు వ్యవసాయ అనుబంధ రంగాల పైనా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దీంతోపాటు రైతులవే కాదు.. అందరి హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. తమకు అన్యాయం జరిగిందంటే అన్నదాతలు అదనపు కలెక్టరో, కలెక్టర్‌ దగ్గరకో వెళ్లాలి తప్ప న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి వీల్లేదు. అసలు స్థానిక అధికారులు కార్పొరేట్‌ కంపెనీలను కాదని ఏమైనా చేయగలరా...? నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఎందరికి పరిహారం లభిస్తుంది. ఇక్కడ చట్టప్రకారం అవకాశం ఉండీ ఏమీ చేయలేకపోతున్నారు. అసలు చట్టాలే రైతులకు వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత మొదట వ్యవసాయం, రైతులతో ప్రారంభించారు. తర్వాత దీన్ని అనేక రంగాలకు విస్తరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపైన కానీ, కేంద్ర ప్రభుత్వంపైన కానీ, ఏ అధికారిపై కానీ న్యాయపరంగా వెళ్లడానికి అవకాశం లేకుండా కొత్త చట్టాలు చేశాయి. ఎమర్జెన్సీ సమయంలో అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేసినట్లు, ఇప్పుడు కూడా ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రయత్నం ఇది.

నిపుణుల కమిటీ వేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందులో మీ పేరును కూడా ప్రస్తావించింది. కమిటీ వేసి చర్చించడంవల్ల ప్రయోజనం ఉంటుందా?

జ: తొలుత ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వమే పలు సవరణలకు అంగీకరించింది. అంటే చట్టాల్లో అన్ని లోపాలున్నాయన్నట్లే కదా. కమిటీలతో ఏమీ ప్రయోజనం ఉండదు. బీటీ పత్తిపై సుప్రీంకోర్టు సూచన మేరకు నిపుణుల కమిటీ వేశారు. కానీ వాళ్లు చేసిన సిఫార్సులు అమలు చేయలేదు. స్వామినాథన్‌ కమిషన్‌ వచ్చే 40 ఏళ్లలో ఏం చేయాలో చెప్పింది. ఈ సిఫార్సులకు 99 శాతం మంది రైతుల అంగీకారం ఉంది. వాటిని అమలు చేస్తే సరిపోతుంది. కొత్త కమిటీలు ఎందుకు. కేవలం వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల గురించి చర్చించడానికే ప్రత్యేకంగా ఓ పార్లమెంటు సమావేశం నిర్వహించాలి. నీటి ప్రైవేటీకరణ, ఆదివాసీ రైతుల సమస్యలు ఇలా అన్ని అంశాలపైనా చర్చలు జరపాలి. రైతులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీ రైతులు, ప్రజాపంపిణీ వ్యవస్థ ఇలా అన్నింటి గురించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కార్పొరేట్లకు అనుకూలంగా కాదు.

కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టాలను రద్దు చేస్తే సమస్య తీరుతుందంటారా?

జ: ప్రస్తుతమున్న ఏపీఎంసీ వ్యవస్థ మరీ గొప్పది కాదు. సమస్యలున్నాయి. అయితే పంజాబ్‌, హరియాణానే కాదు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో మార్కెట్లలో పంటల కొనుగోలు విధానం ఉంది. వరి, గోధుమ కాదు మొక్కజొన్న, పత్తి, వేరుసెనగ ఇలా పలు పంటలను కొంతమేర కొనుగోలు చేస్తున్నారు. రైతుకు ఓ భరోసా ఉంది. వీటిని ఇంకా మెరుగ్గా చేస్తేనే పరిష్కారం. పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం మంచిది కాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తాలుకా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే ఏమవుతుంది. ఇది కూడా అంతే. ప్రభుత్వం మౌలిక వసతులు పెంచాల్సింది పోయి ఉపసంహరించుకోవడం పరిష్కారం కాదు. కొత్త చట్టాల్లోని ప్రతి నిబంధన కార్పొరేట్ల కోసమే రాశారు. రైతు బీమాను ప్రైవేటుకు అప్పగించారు. ఇలా వ్యవసాయానికి సంబంధించిన అన్నింటినీ వ్యూహాత్మకంగా ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పచెబుతుంది.

రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి ఆరోపించారు. రైతుల ఆందోళనకు విపక్షాలే కారణమంటారా?

జ: రైతులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తుంటే విపక్షాల గురించి, కాంగ్రెస్‌ గురించి ప్రధానమంత్రి మాట్లాడటం నవ్వు తెప్పిస్తుంది. అసమ్మతి వాదులందరినీ కూడగట్టుకొని వారాంతపు సమావేశం పెట్టుకోవడానికే కాంగ్రెస్‌కు ఇంత సమయం పట్టింది. ఇప్పుడు కూడా అందరూ రాలేదు. అలాంటిది పార్టీ రైతులను సమీకరించి ఆందోళన చేయించగలదా? విపక్షాలు రైతులను సమీకరించలేదు. రైతులే అందరినీ కదిలించారు. నేను స్వయంగా సింఘు సరిహద్దు వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడాను. వారిలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంది. చట్టాలు ఉపసంహరించుకొనే వరకు ఉద్యమాన్ని వదలబోమంటున్నారు. సైన్యంలో ఉన్నతస్థానంలో ఉండి దేశం కోసం పోరాడి పదవీ విరమణ చేసిన వారు కూడా రైతులకు మద్దతుగా పాల్గొంటున్నారు. 18 కిలోమీటర్ల మేర అడుగు వేయడానికి స్థలం లేనంతగా రైతులు కిక్కిరిసి ఉన్నారు. ప్రధాన వేదిక వద్దకు చేరుకోవడానికి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. రైతులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో పాల్గొంటే పశువుల సంరక్షణ, వృద్ధుల జాగ్రత్తలు చూసుకోవాలని గురుద్వారాలు భక్తులకు సూచిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా రైతులు వచ్చి ఆందోళనలో భాగస్వాములవుతున్నారు.

ఇదీ చూడండి :రైతులను మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

Last Updated : Dec 21, 2020, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details