Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పరమైన రాతలు కనబడకుండా తెల్లసున్నం వేయించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలు ఉండకుండా అధికారులు చూసుకుంటున్నారు. ఎవరైనా ఎలక్షన్ కోడ్ సీఈసీ ఆదేశాలను పక్కగా పాటించాలని.. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడంతో వెంటనేఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన యంత్రాగం ఎన్నికల నియామావళిని పకడ్బంధీగా అమలుచేస్తోంది. ఎలాంటి విఘాతాలకు చోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేలా.... ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నగదు, బంగారం, లిక్కర్ తరలింపు వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Khammam Collector Meeting On Elections : ఖమ్మంలో అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రామాణికాలు పాటించాలో సిబ్బందికి సూచించారు. ప్రజలతో మమేకమై పని చేయాలని.. ఎలాంటి అవాంతరాలకు చోటివ్వవద్దని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు.