జంట నగరాల్లో వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. నేడు కూడా గణేశ్ విగ్రహాలను భక్తులు నిమజ్జనానికి తీసుకువస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఖైరతాబాద్ మహా గణపతి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ నాలుగు వద్ద గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఆ తర్వాత నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనం చేయడంలో అధికారులు వేగం పెంచారు. సాయంత్రం 6 గంటల తర్వాత బాలాపూర్ గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
నగరంలోని అన్ని మార్గాలు ట్యాంక్ బండ్ వైపే అన్నట్టు చిన్న వినాయక విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. బాలాపూర్ విగ్రహం శోభాయాత్ర ప్రారంభం కాగానే.. వెనువెంటనే పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి ఉత్సవ నిర్వాహకులు.. బాలాపూర్ గణనాథుడి వెంటే ఇతర వినాయక విగ్రహాలు అనుసరించాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ తదితర విభాగాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ కూడా విగ్రహాలు ఇంకా ట్యాంక్‌బండ్‌కు తరలివస్తునే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.
గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి...
ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగింది. తొమ్మిది రోజులపాటు వేలాదిమంది భక్తుల విశేష పూజలందుకున్న పంచముఖ మహారుద్ర గణపతి శోభాయాత్ర.. వైభవోపేతంగా జరిగింది. రెండు కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చి మహాగణపతికి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం ట్యాంక్ బండ్ వద్ద నాలుగో క్రేన్ వద్ద మహా గణపతి గంగమ్మ ఒడిని చేరారు.
నిన్న సాయంత్రం బాలాపూర్ గణేేశ్ జలప్రవేశం..
గణేశ్ ఉత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నగరంలోని బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈసారి గతంలో కంటే ఎక్కువ రేటు పలికింది. ఈసారి రూ. 18 లక్షల 90వేలు పలికింది. అనంతరం శోభాయాత్రకు బయలుదేరిన బాలాపూర్ గణేశ్... ట్యాంక్‌బండ్ 9వ క్రేన్ వద్ద జలప్రవేశం చేశారు.