హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనం (ganesh immersion) చివరి దశకు చేరుకుంది. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు ఉండటంతో పాటు వర్షం కారణంగా నిన్న ప్రారంభమైన నిమజ్జనం కొంత ఆలస్యమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తైంది. ఎన్టీఆర్ మార్గ్‌లో వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు రాకపోకలకు పోలీసులు అనుమతించారు. ఒకవైపు రాకపోకలకు అనుమతిస్తున్నారు.
అయితే పీవీ మార్గ్‌లో వినాయక విగ్రహాలు ఇంకా బారులుతీరే ఉన్నాయి. ఈ విగ్రహాలను ఎన్టీఆర్ పార్క్, ఘాట్, లేపాక్షి సమీపంలోకి తరలిస్తూ.. అక్కడ నిమజ్జనం చేయిస్తున్నారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలను ఖైరతాబాద్ వంతెన నుంచి పంపిస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గం వైపు వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నానికి గణేశ్ నిమజ్జనం పూర్తి కానుంది. అప్పటి వరకు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, పీవీ మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది.
రాకపోకలు పునరుద్ధరణ..
ఇప్పటి వరకు 4 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగా.. మరికొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పునరుద్ధరించారు. ట్యాంక్‌బండ్‌పై రెండు వైపులా రాకపోకలు పునరుద్ధరించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.