తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు - పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ.... ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నదని పేర్కొంది. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
దంచికొడుతున్న వానలు...
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా... వంతెనలు తెగాయి. చెరువు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్ రహదారులు వరద ఉద్ధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.