తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా ఇసుక అక్రమ రవాణా.. కృష్ణా జిల్లా టు హైదరాబాద్.. వయా వైసీపీ ఎమ్మెల్యే!

Sand Illegal Transportation : ఏపీలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఈ దందా జోరు మరీ ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ కీలక నేతల సలహాతోనే హైదరాబాద్‌కు యథేచ్ఛగా ఇసుక తరలివెళ్తోంది. నెలకు రూ.15 కోట్ల నికర లాభం పొందుతున్నట్లు సమాచారం.

జోరుగా ఇసుక అక్రమ రవాణా
జోరుగా ఇసుక అక్రమ రవాణా

By

Published : Dec 10, 2022, 11:32 AM IST

జోరుగా ఇసుక అక్రమ రవాణా

Sand Illegal Transportation : పైన కనిపిస్తున్న లారీలు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కనిపించాయి. ఒక్కో లారీ సామర్థ్యం 25 టన్నులే. అయినప్పటికీ ఒక్కోదానిలో 45 టన్నుల వరకు ఇసుక ఉంటోంది. కంచికచర్ల మండలం గనిఆత్కూరు సమీపంలోని కృష్ణా నది రేవులో లోడ్ చేశారు. ఇవి నేరుగా హైదరాబాద్‌కు వెళ్తాయి. ఇలా రోజు వంద వరకు లారీలు వెళుతున్నాయి. ఏపీలోని సరిహద్దు రవాణా కేంద్రం గరికపాడు, తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో ఉన్న మరో రవాణా కేంద్రం వద్ద ఎలాంటి తనిఖీలు ఉండటం లేదు.

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక కాంట్రాక్టు తీసుకున్న ఓ వైసీపీ ఎమ్మెల్యే.. రోజుకు 10 లారీలు, ఆయన బంధువు.. పీఏగా వ్యవహరించే వ్యక్తి 10 లారీలు.. ప్రభుత్వంలో కీలక సలహాలనిచ్చే వ్యక్తి కుమారుడు 10 లారీల చొప్పున పంచుకుంటూ రవాణా చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఒకరు, ఆయన అనుచరగణం 10 లారీలు, ఎగువసభకు ఎంపికైన ఓ నేత, ఓ యువ నాయకుడు ఇలా తలా కొన్ని లారీలను హైదరాబాద్‌కు తరలించేస్తున్నారు.

ప్రభుత్వ కీలక సలహాదారు కుమారుడు భాగస్వామిగా ఉండటంతో యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులిద్దరికీ భాగస్వామ్యం ఉండటంతో రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రజాప్రతినిధికి చెందిన 5 లారీలు ఇసుక ఓవర్ లోడ్‌తో హైదరాబాద్ వెళుతుండగా, గరికపాడు తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీఏ అధికారి చలానా వేశారు. ఆ ప్రజాప్రతినిధి చలానా సొమ్ము చెల్లించి, ఆ వెనుకే వచ్చిన ఇతర ప్రజాప్రతినిధుల లారీలకు ఎందుకు చలానా వేయలేదంటూ ఆర్టీఏ అధికారిని కొట్టినంత పని చేశారు.

నాటి నుంచి చలానాలు నామ మాత్రమయ్యాయి. కీసర టోల్‌ప్లాజా వద్ద ఇటీవల ఓ ఆర్టీఏ అధికారి ఇసుక లారీలను ఆపి లారీకి రూ.5 వేల నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఓవర్ లోడ్ పేరుతో రూ.20 వేల చలానా వేస్తామని హెచ్చరించారు. విషయం ప్రభుత్వంలోని కీలక సలహాదారు దృష్టికి వెళ్లడంతో ఆర్టీఏ ఉన్నతాధికారి నుంచి కింది అధికారులకు హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. గరికపాడు వద్ద పది లారీలను కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఒక అధికారి నిలిపివేశారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చి ఆర్టీఏ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. నామమాత్రంగా కేసులు నమోదు చేసి జరిమానాలతో పంపించడం చకచకా సాగాయి. అవి తెలంగాణకు వెళ్లిపోయాయి. ఆ అధికారి అక్కడి నుంచి బదిలీ అయ్యారు.

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలిపోతోంది. రవాణాలో సూత్రధారులంతా ప్రభుత్వంలోని పెద్దలే. కంచికచర్ల మండలం గని ఆత్కూరు, చందర్లపాడు మండలం కాసరాబాద్‌, నందిగామ మండలం కంచెల, మాగల్లు రేవులనుంచి లారీలు తరలుతున్నాయి. అన్ని లారీలు టీఎస్ రిజిస్ట్రేషన్లతో ఉంటున్నాయి. వేబిల్లుల తీరు అనుమానాస్పదంగా ఉంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. 5 నుంచి 10 లారీలకు ముఖ్య నేతల అనుచరులతో అనుసరించే ఎస్కార్టు గమ్యస్థానానికి చేరవేస్తోంది.

ఇవీ చదవండి..:

కృష్ణా బోర్డుకు ఆర్‌ఎంసీ తుది నివేదిక..

'అంతర్రాష్ట్ర సమస్యే కాదు.. బేసిన్‌ది కూడా'

ABOUT THE AUTHOR

...view details