తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందు బంద్‌.. వెనుక మందు

భాగ్యనగరంలో ఒకవైపు లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతున్నప్పటికీ....మరో వైపు అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. నగరంలోని మద్యం దుకాణాలన్నింటికి అధికారులు సీలు వేశారు. తిరిగి అనుమతించే వరకు షాపులను తీయడానికి లేదు. ఈ సీళ్లు కొంతమంది వ్యాపారుల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.

illegal liquor business at Hyderabad
illegal liquor business at Hyderabad

By

Published : May 5, 2020, 9:50 AM IST

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 374 మద్యం షాపులు ఉన్నాయి. అనేక బార్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. మహానగరంలో వందలమంది ఇదే వ్యాపారంలో ఉన్నారు. కొంతమంది ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి డోర్‌ డెలివరీ ఇస్తున్నారు. దీనికి రేటు మాత్రం మూడింతలకు పైగా అధికంగా ఉంటోంది. రూ. 300లు ఉండే సాధారణ మందు (ఫుల్‌బాటిల్‌)ను రూ. 700 నుంచి రూ.1200ల వరకు విక్రయిస్తున్నారు. రూ. 1050 ఉండే మద్యం సీసాలను రూ. 4వేల నుంచి రూ. 5వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక రూ. 5వేలకు పైగా ఉన్న మద్యం సీసాలను రూ. 15వేల నుంచి రూ. 20 వేల వరకు అమ్ముతున్నారు. కాస్త ఖరీదైన బ్రాండ్‌ బాటిల్‌ రూ.10 వేలు ఉంటే స్టాకు తక్కువగా ఉందన్న ఉద్దేశంతో రూ.70 వేల నుంచి రూ.85 వేల వరకు విక్రయిస్తున్నారు.

వాట్సాప్‌ ద్వారా ఈ వ్యాపారాలను చాలా మంది కొనసాగిస్తున్నారు. ఇందుకోసం మందుబాబులు వాట్సాప్‌ గ్రూపులుగా ఏర్పడి తద్వారా మద్యం కొనుగోలు చేస్తున్నారు. షాపులకు అధికారులు సీలు వేస్తే కొన్ని చోట్ల ఈ సీలును తొలగించి వ్యాపారం చేస్తుండగా, కొంతమంది షాపు వెనుక భాగంలో తలుపులు తీసి నిరభ్యంతరంగా అమ్మకాలు సాగిస్తున్నారు. దుకాణదారులు తమ వద్ద నిత్యం నిర్వహించే రిజిస్టర్‌ పుస్తకాలను తీసుకెళ్లి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌ వ్యవహారంలో పోలీసులు ఇదే గుర్తించారు. కొందరు ఎక్సైజ్‌ పోలీసులు సైతం ఈ వ్యవహారంలో చేతులు కలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీలును తొలగించి మద్యం సీసాలు తీసి తిరిగి సీలు వేయించినట్లు తెలుస్తుంది.

  • జూబ్లీహిల్స్‌లోని సీక్రెట్‌ అఫైర్‌ పబ్‌కు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్సైజ్‌ పోలీసులు సీలు వేశారు.. కాని వెనుక ఉన్న తలుపు తీసి కొందరు సిబ్బంది మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. తలుపు తెరిచి కూర్చొన్న పబ్బు మేనేజర్‌ సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
  • బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని కర్మ పబ్‌కు ఎక్సైజ్‌ పోలీసులు వేసిన సీలును తొలగించినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తమ నిఘాలో గుర్తించారు. విషయం ఆరా తీసి, పబ్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేయగా దాదాపు 20 నుంచి 25 మద్యం సీసాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పబ్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బెల్టు దుకాణాల్లో...

నగరంలోని చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న బెల్టుదుకాణాలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరింత సొమ్ము చేసుకుంటున్నాయి. బోరబండ, ఫిలింనగర్‌, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న బెల్టు దుకాణదారులు, చిన్నచిన్న వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

మరోవైపు గుట్కాల ధరలు సైతం నాలుగు నుంచి ఆరింతలు పెరిగాయి. దుకాణదారులు ఆయా సరకులను బ్లాక్‌ చేస్తున్నారు. పెద్ద గోల్డ్‌ప్లాక్‌ సిగరెట్‌ డబ్బా ధర రూ. 180 ఉండగా రూ. 300కి విక్రయిస్తున్నారు. రూ. 10 ఉండే అంబర్‌(గుట్కా) రూ. 60కి, రూ. 10 ఉండే రాజాఖైనీ రూ. 40కి విక్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details