హైదరాబాద్ నగరంలో 20 లక్షలకుపైగా నిర్మాణాలుంటే.. అందులో 15 లక్షలు ఆస్తిపన్నుల జాబితాలో, 1.2 లక్షలు బీఆర్‌ఎస్(భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకం) కింద దరఖాస్తు చేసుకున్న విభాగంలో ఉన్నాయి. మిగిలినవన్నీ అక్రమ నిర్మాణాలే. బీఆర్‌ఎస్ నోటిఫికేషన్ అనంతరం నిర్మించినవి. లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలు, చెరువులు, లేఅవుట్ ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున నిర్మాణాలు జరిగాయి. మంత్రి కేటీఆర్ సైతం ఆ విషయమై అధికారులను ప్రశ్నించారు. లింకు రోడ్ల నిర్మాణ పనుల తనిఖీల్లో భాగంగా నెల క్రితం షేక్‌పేట, ఖాజాగూడ, బీఎన్‌ఆర్‌హిల్స్ ప్రాంతాలను మంత్రి సందర్శించారు. అక్కడున్న యూఎల్‌సీ భూముల్లో నిర్మాణాలు జరుగుతుండటంపై యంత్రాంగాన్ని నిలదీశారు.
ఐటీ కారిడార్‌లో ఎక్కువ..
అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఐటీ కారిడార్‌లో విపరీతంగా జరిగాయి. నకిలీ యూఎల్‌సీ పత్రాలు సృష్టించడం, అడ్డదారిలో నిర్మాణ అనుమతులు పొందడం అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్టు భూముల్లో సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా అదే పరిస్థితి. సాక్షాత్తు జెడ్సీ ఆఫీసు ఎదురుగా సుదర్శన్‌నగర్‌కాలనీలో ఓ నిర్మాణం నిదర్శనం. ఓ వ్యక్తి పక్కింటి ప్రహరీని కూల్చి సెట్‌బ్యాక్ స్థలంగా చూపించారు. మూడంతస్తుల భవనం పూర్తిచేశారు. మరో అంతస్తు నిర్మిస్తున్నారు.