ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు భారీగా కూల్చేశారు. నోటరీ ద్వారా ప్లాట్లు అమ్మి ప్రజలను మోసం చేసే భూ కబ్జా దారులపై ఉక్కు పాదం మోపారు. హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడుతూ అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ స్పష్టం చేశారు.
'అక్రమ నిర్మాణాలు నేలమట్టం...కబ్జాదారులపై ఉక్కు పాదం'
హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడున్న వారిపై కాప్రా తహసీల్దార్ ఉక్కు పాదం మోపారు. అక్రమ నిర్మాణాలను పోలీసుల సాయంతో కూల్చేశారు.
సర్వే నంబర్ 585, 587లలో సుమారు 2 ఎకరాల 20 గుంటల భూమిలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసుల సహాయంతో నేలమట్టం చేశారు. 18 ఇళ్లను, 5 బేస్మెంట్లను జేసీబీ సాయంతో కూల్చేశారు. నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి అప్పగించామని అన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగితే ఉపేక్షించేదేలేదని తహసీల్దార్ వెల్లడించారు. కార్యక్రమంలో గిర్దావర్ రమేశ్, వీఆర్వో విజయ్, ఎస్ఐ మోహన్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.