తెలంగాణ

telangana

ETV Bharat / state

‘ఉచితం’ ముసుగులో అక్రమ నల్లాలు.. పలువురు ఇంటి దొంగలపై కేసులు

గ్రేటర్​ హైదరాబాద్ పరిధి​లో ప్రవేశపెట్టిన ఉచిత తాగునీటి పథకం దారిమళ్లుతోంది. కొందరు ఇంటిదొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తూ.. అక్రమంగా 'ఉచిత' నల్లా కనెక్షన్​లు ఇస్తున్నారు. డబ్బులు దండుకుంటూ జలమండలి ఆదాయానికి గండికొడుతున్నారు.

free water scheme in hyderabad
‘ఉచితం’ ముసుగులో అక్రమ నల్లాలు..

By

Published : Mar 31, 2021, 9:37 AM IST

భాగ్యనగరంలో ఉచిత తాగునీటి సరఫరా పథకం ముసుగులో విచ్చలవిడిగా అక్రమ నల్లాలు పెరిగిపోతున్నాయి. ఇందులో ఇంటిదొంగల హస్తలాఘవం బహిర్గతమవుతోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు డబ్బులు తీసుకొని వీటిని జారీ చేస్తున్నారు. జలమండలి ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక్కో నల్లాకు రూ.10-20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎక్కువ అంతస్తులున్న భవనాలకైతే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. లైన్‌మేన్‌లు, బిల్లింగ్‌ ఏజెంట్లుగా పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి స్థానిక సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల నుంచి పూర్తి అండదండలు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి.

నిబంధనల ప్రకారం నల్లా తీసుకుంటే ఫీజిబిలిటీ ధ్రువీకరణ తప్పకుండా ఉండాలి. దీంతో ఇలా అక్రమ పద్ధతుల్లో నల్లాలను తీసుకుంటున్నారు. ఉచిత పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి మరింత పెరుగుతున్నాయి.

ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై క్రిమినల్‌ కేసు

ఈ దందాలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర తేటతెల్లమవుతోంది. జలమండలిలోని ఉన్నతోద్యోగుల బంధువులు, లేదంటే పైరవీలతో ఉద్యోగాలు పొందిన వారు ఇలా బోర్డుకు నష్టం కలగజేస్తున్నారు. తాజాగా వీరి బాగోతం మరోసారి బయటపడింది.

  • మైలార్‌దేవ్‌పల్లి, టీఎన్జీవో కాలనీ ఇంటి నం.8-12-413లో నివాసం ఉంటున్న రాజు అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా 15 ఎం.ఎం నల్లా కనెక్షన్‌ను పొందాడు. ఇందుకు స్థానిక ఔట్‌ సోర్సింగ్‌ లైన్‌మెన్‌ వెంకటేశ్​ సాయం అందించాడు. అందుకు రాజు సదరు లైన్‌మెన్‌కు రూ.10 వేలు సమర్పించుకున్నాడు. సంబంధిత యజమానితో సహా, ఔట్‌ సోర్సింగ్‌ లైన్‌మెన్‌ వెంకటేశ్​పై స్థానిక మైలార్​దేవ్‌పల్లి ఠాణాలో యు/ఎస్‌ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  • ఐడీపీఎల్‌, గాంధీనగర్‌ ఇంటి నం. 27-63/1లో నివసిస్తున్న గడ్డం రవి, ఇంటి నెం.27-136లో ఉంటున్న సురేందర్‌కుమార్‌ అక్రమ నల్లాలు పొందారు. స్థానిక జలమండలి ఔట్‌ సోర్సింగ్‌ మీటర్‌ రీడర్‌ కమల్‌ బాయ్‌, మరో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చంద్రశేఖర్‌ సాయం చేశారు. వారినుంచి చెరో రూ.20 వేలు వసూలు చేశారు. సంబంధిత యజమానులతో సహా వీరికి సహకరించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై బాలానగర్‌ ఠాణాలో యు/ఎస్‌ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు పెట్టారు.

ఇదీ చూడండి: నీటి పారుదల శాఖలో చిత్రవిచిత్రాలు.. మూణ్నెల్లలో మూడుసార్లు బదిలీ

ABOUT THE AUTHOR

...view details