జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హైదరాబాద్ నల్లకుంటలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఆ శాఖ అధికారి టి.కె.థామస్ ద్వారా కేంద్ర కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాన్ని పంపించారు.
మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం: ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి - ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్
దేశంలో జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు చట్టాలు తీసుకురావడం సహించరానిదని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
దేశంలో తాము ఉద్యమాలతోనే వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని సాధించుకున్నామని భారతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. పాలకులకు, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మేలు చేసే చట్టాలు తేవాల్సింది పోయి.. కీడు చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మీడియా వ్యతిరేక ధోరణిని తాము పోరాటాలతోనే ఎదుర్కొంటామని తెలిపారు.