Indian educational campuses in abroad : దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు విదేశాల్లో తమ ప్రాంగణా(క్యాంపస్)లను నెలకొల్పేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీ, మద్రాస్, బాంబే తదితర ఐఐటీలు కేంద్ర ప్రభుత్వంపై అనుమతి కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో విధివిధానాల తయారీకి ఐఐటీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన 16 మంది విద్యావేత్తలతో నిపుణుల కమిటీని యూజీసీ తాజాగా నియమించింది. ఇందులో ఏడు ఐఐటీలు, ఐఐఎస్‌సీ సంచాలకులు, మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బీజే రావు కూడా ఒక సభ్యుడు. ఈ కమిటీ మార్చిలోపు నివేదిక ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ, మధ్య తూర్పు ఆసియా దేశాల్లో మన ఐఐటీలు, కేంద్రీయ వర్సిటీలు విదేశీ ప్రాంగణాల స్థాపనకు సమాయత్తమవుతున్నాయి. అక్కడ ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండటమూ ఇందుకు ఒక కారణం కావొచ్చని తెలుస్తోంది.
విదేశాల్లో ఎందుకు?
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మన విద్యాసంస్థలు వెనకబడుతున్నాయి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 200లోపు స్థానాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ), ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాస్‌లు మాత్రమే చోటు దక్కించుకుంటున్నాయి. వందలోపు ర్యాంకుల్లో నిలవాలన్న లక్ష్యం దశాబ్దాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. విదేశీ విద్యార్థుల సంఖ్య అతి స్వల్పంగా ఉండటమే అందుకు కారణం. విదేశాల్లో ప్రాంగణాలు నెలకొల్పితే ర్యాంకులు మెరుగుపడటమే కాకుండా భారతీయ విద్యావిధానాన్ని విదేశీయులకు చేరువ చేసినట్లవుతుందని ఐఐటీలు, కేంద్రీయ వర్సిటీలు భావిస్తున్నాయి. విశిష్ట విద్యాసంస్థల(ఇన్‌స్టిటూట్స్ ఆఫ్ ఎమినెన్స్) హోదా పొందిన వర్సిటీలు, ఐఐటీలు విదేశాల్లో ప్రాంగణాలను నెలకొల్పేందుకు యూజీసీ అనుమతి ఇచ్చింది. ఆ హోదా ఉన్న వాటిలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ఈజిప్ట్, సౌదీ అరేబియాల్లో ప్రాంగణాలను నెలకొల్పేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐఐటీ దిల్లీ ఇటీవల కేంద్ర విద్యాశాఖకు దరఖాస్తు చేసింది.