5జీ సెల్యులార్ చిప్‌సెట్ ‘కోలా’ను ఐఐటీ హైదరాబాద్, వైసిగ్ అంకుర సంస్థలు అభివృద్ధి చేశాయి. ‘స్వదేశీ 5జీ టెస్ట్‌బెడ్’ ప్రాజెక్టులో భాగంగా దీనిని దేశంలోనే తొలిసారిగా రూపొందించారు. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ విభాగం ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చింది. ‘కోలా’ అనేది న్యారోబ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిస్టమ్ ఆన్ చిప్. ఇదొక 5జీ మెషిన్ టైప్ టెలీకమ్యూనికేషన్ టెక్నాలజీ. దీర్ఘశ్రేణిలో ఐవోటీ ఆప్లికేషన్లను ఉపయోగించడం, సంబంధిత పరికరాల బ్యాటరీ జీవితకాలాన్ని పదేళ్ల వరకు పెంచడానికి ఇది దోహదం చేస్తుంది.
5జీ చిప్‌సెట్ ప్రత్యేకతలు..
మెషిన్లను అంతర్జాలంతో అనుసంధానించేలా చూడడం ఈ చిప్‌సెట్ ప్రత్యేకత. ఏడాది వ్యవధిలో దీనిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేలా వైసిగ్ సంస్థ కసరత్తు చేస్తోంది. స్మార్ట్ మీటర్లు, ఒక మెషిన్ నుంచి మరో మెషిన్‌కు అనుసంధానం, లోకేషన్ ట్రాకింగ్, డిజిటల్ హెల్త్‌కేర్ రంగాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది.