Smart Glass innovation by IIT Hyderabad: ఇప్పుడంతా స్మార్ట్ యుగమే. రోజు రోజుకీ పెరుగుతోన్న టెక్నాలజీ మనుషుల జీవన విధానాన్నే మార్చేసింది. ఏ పని కావాలన్నా సులభంగా, చిటికెలో మనం ఉన్న దగ్గరి నుంచే చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదంతా ప్రస్తుత కాలంలో మనకు అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికత వల్లే సాధ్యం. రకరకాల పరికరాలతో మన వాయిస్ తోనే ఆపరేట్ చేస్తున్నాం. దీనికోసం గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి వంటి వాటిని ఉపయోస్తున్నాం.
Smart Glass can operate Home Appliances : సరిగ్గా ఇలాంటి వ్యవస్థ తోనే మన ఇంట్లోని టీవీ, ఫ్యాన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపరేట్ చేయడానికి హైదరాబాద్-ఐఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు ఒక స్మార్ట్ కళ్లజోడును కనిపెట్టారు. దీన్ని ఐఐటీ ముంబయిలో జరిగిన టెక్ ఫెస్ట్‌లో ప్రదర్శించి రన్నరప్ గా నిలిచారు. హైదరాబాద్-ఐఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్న చండీగఢ్ కు చెందిన అక్షిత్ గురేజా, మహారాష్ట్ర కు చెందిన రిషబ్ అగర్వాల్,గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఆదిత్య సెహగల్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తాడిమర్రి దేశిక శ్రీహర్ష లు ఎలక్ట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ క్లబ్ సభ్యులు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేని ఒక వస్తువుని కనుక్కోవాలని, అది సామాన్య ప్రజలకు తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు.
మొదట ఈ ఆలోచన వచ్చింది ఆదిత్య సెహెగల్ కి. దీన్ని తన మిత్రులతో పంచుకున్నాడు. వాళ్లు కుడా తమ వంతు భాగస్వామ్యం అందించగా.. చివరికి అనుకున్నది సాధించారు. స్మార్ట్ గ్లాస్ ఎకో సిస్టమ్ అనే పరికరాన్ని కనుక్కున్నారు. దీన్ని ధరించి ఇంట్లోని వస్తువుల్ని ఆపరేట్, కంట్రోల్ చెయ్యటం ప్రధాన లక్ష్యం. గతేడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించారు. ఎన్నో అపజయాల తర్వాత అనుకున్నది సాధించి.. డిసెంబరులో ఐఐటీ ముంబయిలో జరిగిన ఆటమ్‌బర్గ్ టెక్నాలజీస్ నిర్వహించిన హోమ్ ఆటోమేషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ తమ ప్రత్యేక ఆవిష్కరణ స్మార్ట్ గ్లాసెస్‌తో రన్నరప్ అవార్డును గెలుచుకున్నారు.