కొవిడ్ బాధితుల మోర్టాలిటీ ప్రిడిక్షన్ మోడల్‌ను హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. దేశం మొత్తం కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతోన్న వేళ.. పొదుపుగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ మోడల్ దోహదపడుతుందని ట్రిపుల్ ఐటీ పేర్కొంది. కొవిడ్ వైరస్ ఒక్కో వ్యక్తిలో ఓక్కో రకంగా ప్రభావం చూపుతోంది. చాలామందికి ఎటువంటి లక్షణాలు లేకుండా స్వల్ప ప్రభావంతో వ్యాధి నుంచి బయటపడుతుండగా... మరికొంత మంది సడన్‌గా సీరియస్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇంటెల్, సీఎస్ఐఆర్-ఐజీఐబీ సహకారంతో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మెషిన్ లర్నింగ్ మోడల్స్‌ను ఉపయోగించి కొవిడ్ రోగుల్లో రిస్క్ అండ్ మోర్టాలిటీ రేటును గుర్తించేందుకు పరిశోధనలు చేపట్టారు. ట్రిపుల్ ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ద్వారా కరోనా పాజిటివ్ అని తేలిన వారి మోర్టాలిటీ రేటును 90 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు క్లెయిమ్ చేస్తున్నారు.