కొవిడ్-19 రోగంతో యుద్ధం చేయాలి తప్ప రోగితో కాదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. బాధితులకు దూరంగా ఉండటం ముఖ్యమే అయినా వారికి కావాల్సిన సాయం చేస్తూ భరోసా నింపాలన్నారు. లేదంటే మనశ్శాంతి కోల్పోయి భయంతో చనిపోయే కేసులూ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పారు. కరోనాపై పోరాటంలో అంతిమ విజయం మనదే అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కనుగొన్న ఔషధాలను వాడుతూ, ముందు జాగ్రత్త చర్యలను పాటిస్తే అక్టోబరు, నవంబరు నాటికి పాజిటివ్ కేసులను తగ్గించగలమని చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్ర్టియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగశాలలైన ఐఐసీటీ, సీసీఎంబీ, ఇతర సంస్థలు చేపట్టిన పరిశోధనలపై శనివారంనిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం కొవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న ఫావిపిరవిర్, రెమిడిసివిర్ వంటి ఔషధాలను భారత్‌లో తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్రియాశీల ఔషధ పదార్థాల(ఏపీఐ)ను ఐఐసీటీ అభివృద్ధి చేసి ప్రైవేటు సంస్థలకు సాంకేతికతను బదలాయించినట్లు చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూన్ బూస్టర్ ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌పై గుజరాత్‌లో జరుగుతున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. త్వరలోనే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.