కరోనా వైరస్ భయంతో మన చేతులే ఇప్పుడు మనకు ఇబ్బందిగా మారే పరిస్థితే నెలకొంది. కరోనా వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను పీల్చటం ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది. అంతేకాదు, వైరస్ చుట్టుపక్కల వస్తువుల మీద అంటుకుంటే దాన్ని ముట్టుకున్న చేతులతో ముఖాన్ని తాకినా సంక్రమిస్తుంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటమే కాదు, వీలైనంతవరకు ముఖానికి చేతులు తాకకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఇది చెప్పినంత సులభం కాదు ఆచరించటం. మనకు తెలియకుండానే ముక్కును, నోటిని తాకుతూనే ఉంటాం. గంటకు కనీసం 23 సార్లయినా ముఖాన్ని తాకుతుంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి దీన్ని అదుపులో ఉంచుకోవటమెలా?
- ఎప్పుడెప్పుడు, ఎలా చేతులను తాకుతుంటామో అనేది గ్రహించటం ప్రధానం. ఇతరులను గమనించటం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. కొందరు బోర్ కొట్టినప్పుడు చుబుకాన్ని చేతులకు ఆనిస్తుండొచ్ఛు ఏదైనా విచారంతో నుదురు రుద్దుకోవచ్చు. విసుగుపుట్టి గోర్లు కొరుకుతుండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనమూ అలాగే చేస్తుండొచ్చు. దీన్ని గుర్తిస్తే ఒకింత పరిష్కారం లభించినట్టే.
- చేతులకు సువాసనతో కూడిన సబ్బు, లోషన్ లేదా పరిమళ ద్రవ్యాన్ని రాసుకోవచ్చు. చేయి ముఖం దగ్గరికి రాగానే వాసన తగులుతుంది. అప్పుడు వెంటనే చేతులను దూరంగా జరపాలి.
- బయటకు వెళ్లినప్పుడు ముఖానికి గుడ్డ మాస్కు ధరిస్తే ముక్కు, నోటిని అంతగా తాకకుండా చూసుకోవచ్చు.
- చేయటానికి ఏ పనీ లేకపోతే స్ట్రెస్ బంతి, ఫిట్జెట్ స్పిన్నర్, రబ్బరు బ్యాండు వంటివి చేతిలోకి తీసుకుంటే సరి. ఆ పనుల్లో పడిపోయి ముఖానికి చేయి తగలకుండా జాగ్రత్త పడొచ్చు.
- డెస్క్ లేదా బల్ల ముందు కూర్చుంటే చేతులను వాటి మీద ఆనించొద్ధు ఒడిలోనో, తొడల కిందో చేతులను పెడితే వెంటనే ముఖం దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు.
- టిష్యూ కాగితం లేదా రుమాలు అందుబాటులో ఉంచుకోవటం మంచిది. ముక్కు మీద దురద పెట్టినా.. కళ్లు, ముక్కు, నోరు తుడుచుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది.
- ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా ముఖానికి ఏమాత్రం చేతులు తాకకుండా చూసుకోవటం కష్టం. కానీ ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను కడుక్కుంటుంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అందువల్ల చేతులు కడుక్కోవటం, దూరం పాటించటం ప్రధానమనే సంగతిని గుర్తుంచుకుని ఆచరించాలి.