నిత్య పనిలో చాలా చురుకైన అమ్మాయి. ఏరి కోరి జాయినైన ఓ కంపెనీలో తానెంత కష్టపడినా, ఆ విషయం పైఅధికారులకు తెలిసినా ఉద్యోగంలో ఉన్నతి మాత్రం కరువైంది. దీంతో వేరే కంపెనీలో ఉద్యోగ వేట ఆరంభించిందామె.
ఆఫీస్ అంటే మన నైపుణ్యాలను పెంచుకుంటూ, కొలీగ్స్‌ని కలుపుకొనిపోతూ.. అంతిమంగా మన పనితనం కంపెనీకి ఉపయోగపడేలా ఉండాలి. మరి, అలాంటి వాతావరణం పలు కారణాల వల్ల విషపూరితమవుతుంది. దాని ప్రభావం మన పైనే కాదు.. కొన్నిసార్లు మన కెరీర్‌నీ దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే నచ్చని చోట పనిచేయడం కంటే.. ప్రత్యామ్నాయం వెతుక్కొని కెరీర్‌లో అభివృద్ధిని సాధించడం ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా మంచిదంటున్నారు. మరి, ఇంతకీ పని వాతావరణాన్ని నెగెటివ్‌గా ప్రభావితం చేసే ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి.
సహోద్యోగులపై అసూయపడే కొలీగ్స్, చేసే పనిపై కాకుండా ఆఫీస్ రాజకీయాలపై దృష్టి పెట్టే ఉద్యోగులు, కెరీర్‌లో ఉన్నతి లేకపోవడం, సెలవు తీసుకున్నా పనిచేయాల్సి రావడం, పైఅధికారుల ప్రోత్సాహం కరువవడం.. ఇలా ఇవన్నీ ఆఫీసుల్లో పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంటాయి. అంతేకాదు.. ఇవి ప్రత్యక్షంగానైనా/పరోక్షంగానైనా మన పనితనం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. అందుకే ఇలాంటి చోట పని చేయడం కంటే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
మిమ్మల్ని దూరం పెడుతున్నారా?
ఒక బృందం ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తోందంటే దానికి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి అప్‌డేట్ ఆ గ్రూప్‌లో ఉన్న అందరికీ తెలిస్తేనే కలిసికట్టుగా ముందుకెళ్లగలం.. అనుకున్న సమయానికి చక్కటి అవుట్‌పుట్‌ని కంపెనీకి సమర్పించచ్చు. అయితే బాగా పనిచేసే వాళ్లపై ఇతర కొలీగ్స్‌కి ఉండే అసూయ, సహోద్యోగుల మధ్య కమ్యూనికేషన్ లోపం, కలిసికట్టుగా కాకుండా గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి నచ్చినట్లుగా వారు పనిచేయడం.. వంటి అంశాలు పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి చోట మీరు పని చేస్తున్నా, చక్కటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా మిమ్మల్ని వేరు చేసి చూడడం, పనికి సంబంధించి మీకు ఎలాంటి అప్‌డేట్ చెప్పకపోవడం.. వంటి అంశాలు మీ వ్యక్తిగత పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఇది క్రమంగా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే అంతిమంగా మీ కెరీర్ ఉన్నతికి గండి పడ్డట్లే! కాబట్టి ఇలాంటి వాతావరణంలో పని చేస్తున్నప్పుడు మీ వెనక జరిగే గ్రూపిజం, ఆఫీస్ రాజకీయాల గురించి, మీ పనితీరు గురించి ముందుగా పైఅధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అయినా లాభం లేదనుకుంటే అందులోనే వేరే విభాగానికి మారడం లేదంటే వేరే ఉద్యోగం వెతుక్కోవడం వల్ల కెరీర్‌లో ముందుకెళ్లచ్చు. అయితే ఇక్కడ వారి కోసం నేనెందుకు నా ఉద్యోగం వదులుకోవాలి అన్న మొండి పట్టుదలను వీడడం మంచిదంటున్నారు నిపుణులు.
ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే!
నచ్చిన ఉద్యోగం వచ్చింది. ఇక నా పనితనమేంటో చూపిస్తా.. అంటూ ఎంతో ఉత్సాహంగా తాము కోరుకున్న జాబ్‌లో జాయినవుతుంటారు చాలామంది. అయితే అక్కడికెళ్లి కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేస్తే గానీ తెలియదు ఆ కంపెనీ పని వాతావరణం గురించి! ఈ క్రమంలో ఎంత పని చేసినా సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, కొన్ని కంపెనీల్లోనైతే పనిచేసే వారికంటే చేయని వారికే అధిక ప్రాధాన్యమిస్తూ వారికే పైఅధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం.. వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి వాతావరణం ప్రత్యక్షంగా మనం చేసే పని పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంటుంది.