రాష్ట్రంలో కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్) అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి ఏకగవాక్ష విధానంలో అమలు చేయడంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి మార్గం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అనేక రూపాల్లో నిధుల వ్యయం
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాలు, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్‌ఐల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వైద్యసేవలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. అదనంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఏటా పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నా.. వైద్య సేవల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోనూ ఆన్‌లైన్ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా జిల్లాల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో, వారికి అందుతున్న వైద్య సేవలు ఏలాంటివో అనే సమాచారమేదీ అందుబాటులో లేదు. ఈ దృష్ట్యా వైద్యారోగ్యశాఖ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏ పథకం కింద ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి? వాటికి ఏటా అయ్యే ఖర్చు ఎంత? వాటన్నింటినీ ఒకే గూటికి తేవడం ద్వారా ఏవిధంగా మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు?’’ తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రతిపాదనల్లో పొందుపర్చినట్టు సమాచారం.
వందశాతం ప్రజలకు ఉచిత వైద్యం