కేంద్ర ప్రభుత్వం గుర్తించి, కేటాయించిన ఉత్పత్తి సంస్థల నుంచి అధికంగా ఆక్సిజన్ పొందేందుకు ఉన్న మార్గాలపై ఆంధ్రప్రదేశ్ అధికారులు దృష్టిపెట్టారు. ఒడిశా, బళ్లారి, విశాఖల నుంచి ప్రస్తుత కేటాయింపుల కంటే ఎక్కువగా వచ్చేలా చూడాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో కేసులు తగ్గితే శ్రీపెరంబుదూరు నుంచి అదనంగా ఆక్సిజన్ రప్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనివార్యమైతే.. ఓ దేశం నుంచి సముద్రమార్గం ద్వారా ఆక్సిజన్ తెప్పించే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. దీనికి కనీసం 4 రోజులు పడుతుందని అంచనా.
ఏపీవ్యాప్తంగా 53 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. దీనివల్ల రోజుకి వంద మందికి 20 లీటర్ల చొప్పున ఇవ్వొచ్చునని పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో పడకలకు కొరత ఏర్పడినందున కొవిడ్ సంరక్షణ కేంద్రాలకూ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను సమకూరుస్తున్నారు. కిందటేడు ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపుల సామర్థ్యం ఇప్పుడు సరిపోవడంలేదు. వీటిని కొన్నిచోట్ల మార్చేందుకు, సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్యాంకర్లు కూడా అదనంగా అవసరమవుతాయి.
నాడు గరిష్ఠంగా 260 టన్నులు...
కిందటేడు గరిష్ఠంగా రోజుకు 260 టన్నుల వరకు ఆక్సిజన్ వాడారు. సెప్టెంబరులో ఈ అవసరం వచ్చింది. ఈ సారి సాధారణ పకడలు ఖాళీగా ఉంటుండగా...ఐసీయూ, ఆక్సిజన్ పడకలు నిండిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా ఉన్న 43,916 పడకలకు 28,542 (64.99%) నిండాయి. ఐసీయూలో 76.48%, ఆక్సిజన్ పడకలపై 75.23%మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి 625 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి 46,914 పడకలు ఉంటే...15,371 మాత్రమే ఖాళీగా ఉన్నాయి.