తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌కు దగ్గర్లోని మజీద్‌గడ్డ జంగిల్ క్యాంప్‌ను 2019 డిసెంబరులో ప్రారంభించారు. వందల ఎకరాల విస్తీర్ణం, పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కలు, కిలోమీటర్ల కొద్దీ సైక్లింగ్ ట్రాక్, అడవిలో రాత్రి బస చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి తొలిరోజుల్లో భారీ స్పందన వచ్చింది. కొద్దిరోజులకే కరోనా రావడంతో అటవీశాఖ మూసేసింది.
మూడేళ్లయినా ఇంకా తెరవలేదు. ఈలోగా సాహసక్రీడా పరికరాలు, సైకిళ్లు తుప్పుపట్టాయి. రాత్రి బసకు ఏసీ గదుల నిర్మాణం చేపట్టినా నిధుల సమస్యతో కొన్ని పూర్తికాలేదు. క్యాంటీన్ నిర్మాణమూ జరగలేదు. కొద్ది మొత్తంలో నిధులను కేటాయించి అందుబాటులోకి తీసుకువస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది.
అనంతగిరి హిల్స్‌లో:ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనంతగిరి హిల్స్ ఒకటి. కానీ ఆ తరహా ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. అక్కడున్న నాలుగు అటవీశాఖ కాటేజీల నిర్వహణ ఆధ్వానంగా ఉంది. కాటేజీలకు గడ్డితో పైకప్పు వేశారు. వర్షం కురిస్తే గడ్డి నుంచి వచ్చే వాసనతో అక్కడ ఉండేందుకు పర్యాటకులు ఆసక్తి చూపట్లేదు. కనీస భోజన ఏర్పాట్లు కూడా లేవు. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌కు లేదంటే ప్రైవేటు రిసార్టుకు వెళుతున్నారు.