తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నిర్ధారణ నిదానం.. బాధితులకు వైద్యం ఆలస్యం - తెలంగాణ కరోనా వార్తలు

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వెంటనే సంబంధిత వ్యక్తి చరవాణికి సంక్షిప్త సందేశం రావాలి. నిర్ధారణ ఫలితం రావడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. ఆ తరవాత పాజిటివ్‌ అంటూ చరవాణికి సంక్షిప్త సందేశం పంపించడానికి మరో రెండు రోజులు తీసుకుంటున్నారు. అప్పటి వరకు పలువురు బాధితులకు ఎలాంటి వైద్య సాయం అందడం లేదు. కరోనా బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలంటే పాజిటివ్‌గా పేర్కొన్న ధ్రువపత్రం గానీ, చరవాణికి వచ్చిన సంక్షిప్త సందేశం కానీ చూపాలి. ఇవి లేకపోతే చేర్చుకోవడం లేదు.

CORONA
CORONA

By

Published : Jul 12, 2020, 6:50 AM IST

కరోనాకు ప్రత్యేకించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల కొద్దీ పడకలు ఖాళీగా ఉన్నా బాధితులకు మాత్రం దొరకని విచిత్ర పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అధికారుల స్థాయిలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే. కరోనా బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలంటే పాజిటివ్‌గా పేర్కొన్న ధ్రువపత్రం గానీ, చరవాణికి వచ్చిన సంక్షిప్త సందేశం కానీ చూపాలి. ఇవి లేకపోతే చేర్చుకోవడం లేదు. ఇవి చూపకపోతే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులతో కూడిన పెట్టెను(కిట్‌)ను ఇవ్వడంలేదు. ఫలితంగా వందలాదిమంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెండు మూడు రోజులకు కూడా

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,081 కరోనా పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 85 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. పడకలు వేలల్లో ఖాళీగా ఉన్నా నగరంలోని పలువురు బాధితులు తమను చేర్చుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకల్లో పాజిటివ్‌గా నిర్ధారించిన వారికి రెండు మూడు రోజులకు కూడా ఏ రకం మందులు వాడాలి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై వైద్య శాఖ నుంచి సూచనలు అందడం లేదు.

ఇలా అయితే ఎలా?

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వెంటనే సంబంధిత వ్యక్తి చరవాణికి సంక్షిప్త సందేశం రావాలి. నిర్ధారణ ఫలితం రావడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. ఆ తరవాత పాజిటివ్‌ అంటూ చరవాణికి సంక్షిప్త సందేశం పంపించడానికి మరో రెండు రోజులు తీసుకుంటున్నారు. అప్పటి వరకు పలువురు బాధితులకు ఎలాంటి వైద్య సాయం అందడం లేదు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అనేకమంది గాంధీ, కింగ్‌కోఠి, ఫీవర్‌, ఆయుర్వేద ఆస్పత్రులకు పరుగులు తీసినా మీవద్ద ఎలాంటి ధ్రువీకరణ లేదని, ఆసుపత్రిలో చేర్చుకోలేమని అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో అనేకమంది ప్రాణాలను నిలుపుకోవడం కోసం ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.

కరోనా పరీక్ష ఫలితాల జాబితా అర్బన్‌/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో చేరడం లేదు. ఈ జాబితా చేరితే ఆ కేంద్ర అధికారులు మందులతో కూడిన కిట్‌ను పంపిణీ చేసి ఫోన్‌లో వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై రెండు రోజుల కిందట వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తమ శాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా వారి వైఖరిలో మార్పు కన్పించలేదు.

తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలి

కరోనా బాధితుడిలో లక్షణాల తీవ్రత ఆధారంగా అప్పటికప్పుడు ఆస్పత్రుల్లో చేర్చుకునేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అనేకమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన బాధితుణ్ని మీ పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి సిఫార్సు లేఖ తెచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవేమీ తెలియని సామాన్యులు నానాఅవస్థలు పడుతున్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి ఈ సిఫార్సు లేఖలతో, సంక్షిప్త సందేశంతో సంబంధం లేకుండా ఆస్పత్రుల్లో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details