Details of missing youth in Deccan Mall Incident: సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతంలో డెక్కన్‌మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనిపించకుండా పోయిన ముగ్గురిలో ఒకరి వివరాలను పోలీసులు గుర్తించారు. జనవరి 20న చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మాల్‌లో పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన వసీం, అలీ చాంద్ జునైద్, జావెద్ అనే ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు, క్లూస్ టీమ్ మూడు రోజులు గాలించి మొదటి అంతస్తు లిఫ్ట్ వద్ద ఎముకల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.
తరువాత వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. బాధితుల ముగ్గురి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. అనంతరం వాటిని సరిపోల్చగా.. లభించిన అవశేషాలు జునైద్‌గా గుర్తించారు. అక్కడే సేకరించిన మరికొన్ని అవశేషాలను మిగిలిన ఇద్దరు యువకుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో మరోసారి పరీక్షించనున్నారు.
ఒక్క ప్రమాదం.. మిగిల్చిన విషాదం: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదాల్లో డెక్కన్ మాల్ ప్రమాదం ఒకటి. జనవరి 20న మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన నష్టాన్ని మిగిల్చింది. ఐదు అంతస్థుల భవనంలో ప్రమాదం.. దానికి తోడు క్రీడా, కార్ల విడిభాగాలకు చెందిన షాపు కావడంతో తోలు, ప్లాస్టిక్, నైలాన్ సంబంధిత వస్తువులు కాలిపోవడంతో ఎంతో కాలుష్యం గాలిలో కలిసిపోయింది. నల్లని కారు మబ్బులాంటి పొగ సికింద్రాబాద్ పట్టణాన్ని కమ్మేసింది.
ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో వచ్చి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు, పొగ అదుపులోకి రాకపోవడంతో మరో మూడు ఫైరింజన్లు తెప్పించారు. మొత్తం ఆరు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గంటల తరబడిగా పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. వీరితో పాటుగా డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, 108 సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరోజు రాత్రి వరకు మాల్‌లో అగ్ని కీలలు ఎగసిపడిన.. మరో రెండు రోజులు పాటు భవనం అగ్ని గుండంలా ఉంది.