తెలంగాణ

telangana

ICRISAT: సామల్లో పోషకాలు పుష్కలం.. పరిశోధనల్లో స్పష్టం

By

Published : Jul 7, 2021, 9:42 AM IST

ఇటీవల కాలంలో చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎక్కువైంది. గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాగులు, జొన్నలు వంటి వాటిని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అయితే సామల్లోనూ అపార పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వరి అన్నం కన్నా రుచిగా ఉంటుందని తెలిపారు.

millets, ICRISAT
సామలు, ఇక్రిశాట్

భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లో పండించిన సామ పంట విత్తనాల్లో అపార పోషక విలువలున్నాయని తేలింది. పురాతన విత్తనాలతో ఇటీవల పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ ఆవరణలో ఈపంటను పండించారు. అధిక దిగుబడి రావడంతో వీటిలోని పోషక విలువలపై పరిశోధనలు చేశారు. రోజూ 100 గ్రాముల సామలను ఆహారంగా తీసుకుంటే మనిషికి అవసరమైన 28 శాతం ఇనుము, 37 శాతం జింక్‌, 27 శాతం ప్రొటీన్లు అందుతాయని గుర్తించారు. ఈ పంట సాగు, పోషక విలువలపై ఇక్రిశాట్‌ పరిశోధన పత్రం వెలువరించింది.

ముఖ్యాంశాలు
ప్రస్తుత వాతావరణ మార్పులను తట్టుకుని బతికే సామర్థ్యం సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటలకు ఉంది. 17,500 రకాల పురాతన విత్తనాలను ఇక్రిశాట్‌ భద్రపరిచింది.వీటిలో సామలకు సంబంధించిన పురాతన విత్తనాలే 437 రకాలున్నాయి. వీటిని మనదేశంతో పాటు కామెరూన్‌, మయన్మార్‌, శ్రీలంకల నుంచి సేకరించి ఇక్రిశాట్‌ జన్యు బ్యాంకులో భద్రపరిచింది. వీటిని ఇక్రిశాట్‌ ఆవరణలో సాగుచేయగా ఎకరాకు 8 -10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

వరి అన్నం కన్నా అధిక రుచి
వర్షాధారంగా పంటలు పండించే భూముల్లో సామలు, కొర్రలు వంటి పంటలకు మంచి దిగుబడులు వస్తాయి. పురాతనకాలంలో సాగుచేసిన విత్తన రకాలను ఇక్రిశాట్‌ జన్యు బ్యాంకులో భద్రపరిచాం. పలు పేద దేశాల్లో ఇప్పటికీ వీటిని పండిస్తున్నారు. మనదేశంలో ప్రజలు తినే వరి బియ్యం కన్నా సామలతో వండిన అన్నం రుచిగా ఉంటుంది. వీటితో అనేక రకాల ఇతర ఆహార పదార్థాలు సులభంగా వండుకోవచ్చు.

-వెట్రివెంథన్‌ మణి, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త

పోషకాల సామలు

ఇటీవల కాలంలో చిరుధాన్యాలకు భారీ డిమాండ్ కలిగింది. పైగా కరోనా మహమ్మారి కారణంగా చాలామందికి ఆరోగ్య స్పృహ కలిగింది. రోజూ తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకుంటున్నారు. వాటిలో రాగులు, జొన్నలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సామల్లోనూ ఎన్నో పోషక గుణాలున్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

సమస్యలకు చెక్

సామలు రుచికి తియ్యగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా త్వరగా జీర్ణమవుతాయని తెలిపారు. ఇప్పటికి చాలా దేశాల్లో వీటిని సాగు చేస్తున్నారు. సామలతో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. సామలతో తయారు చేసిన అన్నం చాలా రుచిగా ఉంటుంది.

గుప్పెడు గింజలతో ఆరోగ్యం

పిజ్జాలు, బర్గర్‌ల వంటివీ విరివిగా వినియోగిస్తున్న ఈ కాలంలో కరోనా వచ్చి మన రోగనిరోధక శక్తిని సవాలు చేయటంతో తిండిపై అందరి దృష్టి పడిందిప్పుడు. ఏం తింటే మన ఒంటికి మేలు అనే ఆలోచన మొదలైంది అందరిలోనూ. ‘రోజుకు గుప్పెడు తృణ ధాన్యాలు... మన జీవితాల్నే మార్చేస్తాయి... కావాల్సిన పోషకాలనందిస్తూ... రోగనిరోధక శక్తినీ పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో దోహదం చేస్తాయి... రోజుకు వంద గ్రాములు తీసుకుంటే చాలు... ఆరోగ్యం మీ సొంతం’ అంటోంది జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌). రుచికరమైన ఆహారం సహా జంక్‌ఫుడ్‌ను మరిపించే అనేక వంటకాలను ఈ ధాన్యాలతోనే చేయొచ్చు.

ఇదీ చదవండి:గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం

ABOUT THE AUTHOR

...view details