ఇతర దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో రెండోదశ ఇంత తీవ్రంగా ఉండడానికి కారణమేంటి?
రెండోదశ తీవ్రతకు రెండు అంశాలు కారణం. మొదటిది వైరస్ మార్పు చెందడాన్ని, మొదటి వేవ్ కంటే చాలా ఎక్కువ తీవ్రతతో విస్తరించడాన్ని గుర్తించలేకపోవడం. ఈ విషయాలను పర్యవేక్షించడానికి పది పరిశోధనశాలలకు కేంద్రం బాధ్యతను అప్పగించింది. ఇవన్నీ కలిసి 'ది ఇండియన్ సార్స్ కొవిడ్-2 జినోమిక్ కన్సార్షియం'గా ఏర్పడ్డాయి. కానీ నాకున్న సమాచారం మేరకు ఇవి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చలేదు. రెండో దశ ప్రారంభమైన తర్వాత మాత్రమే కొత్త రకాలు ఇందులో ఉన్నాయన్న విషయాన్ని ఈ కన్సార్షియం గుర్తించింది. రెండోది ప్రభుత్వం ప్రజలు భారీ ఎత్తున గుమిగూడే కార్యక్రమాలకు అనుమతించడం. ప్రజలు కరోనా వెళ్లిపోయిందని భావించి మాస్కు లేకుండానే పెద్దఎత్తున గుమికూడడం, వివిధ కార్యక్రమాలకు హాజరవడంతో వైరస్ కొత్త రకాలు వేగంగా విస్తరించాయి. ఎన్నికల ర్యాలీలు, ప్రచారాలు కూడా కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యాయి.
టీకాలు ఎంత బాగా పని చేస్తాయన్న దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు.?
వ్యాక్సిన్లు బాగా పని చేస్తాయా లేదా అన్న ఆందోళనకు ఎలాంటి గణాంకపరమైన ఆధారం లేదు. వ్యాక్సిన్ల వల్ల కచ్చితంగా ఎక్కువ రక్షణ ఉంటుంది. అయితే మనం అవసరమైన మేరకు సరఫరా చేయడంలోనే విఫలమయ్యాం. దీంతో కొంత మంది రెండో వేవ్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్లు సాయపడలేదని అంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నవారికి వైరస్ నుంచి రక్షణ చాలా ఎక్కువ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుత పరిస్థితులలో వైరస్ జన్యుక్రమం విశ్లేషణ పాత్ర ఏంటి?
చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వైరస్‌లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కొన్ని మ్యుటేషన్స్ మొదటి వేవ్ కంటే తీవ్రమైనవి వస్తున్నాయి. ఇంతకు ముందు వ్యాధి సోకడం, లేదా వ్యాక్సినేషన్ వల్ల లభించిన రోగ నిరోధక శక్తిని తప్పించుకొనే రకాలు కూడా ఉద్భవిస్తున్నాయని చెబుతున్నారు. వీటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యుటేషన్స్‌ను మనం నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ప్రతి వారం వైరస్ నమూనాల జన్యుక్రమం రూపొందించాలి. కొత్త రకాలు వస్తుంటే వెంటనే గుర్తించాలి.
వ్యాక్సిన్ తగినంతగా లేదా సరైన విధంగా వేయకపోవడం వల్ల వైరస్ వ్యాక్సిన్‌కు కూడా లొంగనంత మొండిగా మారుతుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు?
సిద్ధాంతపరంగా ఇది సాధ్యమే కానీ వాస్తవంగా కాదు. ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. తగినంతగా వ్యాక్సినేషన్ జరగకపోవడం అంటే ఏంటి? ఒక డోసు మాత్రమే ఇవ్వడమా... లేక ప్రజల్లో కొంత భాగానికి మాత్రమే వ్యాక్సిన్ వేయడమా? ఇలాంటి తప్పుడు వాదనలతో ప్రజలు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండడం సరైంది కాదు. ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ వేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగాయి. మనం కూడా ఎంత త్వరగా... ఎంత ఎక్కువమందికి వ్యాక్సిన్లు వేయగలం అన్నది ముఖ్యం.
ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?