తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతి ఒడిలో అమ్మ ప్రేమను అందిస్తున్న 'ఇచ్ఛా' ఫౌండేషన్ - తెలంగాణ వార్తలు

బాల్యం... ఒక మధురానుభూతి. కన్ను తెరవకుండానే శారీరక, మానసిక వైకల్యానికి గురైన అనాథలకు మాత్రం... బాల్యం ఓ శాపం. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై... బతుకు భారమైన వారి జీవితాల్లో... 'ఇచ్ఛా' సేవా సంస్థ వెలుగులు నింపుతోంది. ప్రకృతి ఒడిలో అమ్మ ప్రేమను... నాన్న సంరక్షణను అందిస్తూ... ఆదర్శంగా నిలుస్తోంది.

icha-foundation-to-help-orphans-with-disabilities
ప్రకృతి ఒడిలో అమ్మ ప్రేమను అందిస్తున్న 'ఇచ్చా' సేవా సంస్థ

By

Published : Jan 31, 2021, 6:38 PM IST

భర్త నేవీ అధికారి... తనేమో ఫ్యాషన్‌ డిజైనర్‌. రెండు చేతులా సంపాదన... సుఖమైన జీవితం. అంతటితో ఆమె సంతృప్తి చెందలేదు. అనాథ పిల్లల జీవితాల్లో సంతోషం నింపాలని... మధు తుగ్నెట్‌ మదిలో మెదిలిన బలమైన కోరిక 'ఇచ్ఛా' సంస్థకు పురుడుపోసింది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలోని... ప్రకృతి ఒడిలో పదేళ్ల క్రితం ఇచ్ఛా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటివరకూ కొనుగోలు చేసిన బంగారం అమ్మేసిన మధు తుగ్నెట్‌... ఎకరానికిపైగా స్థలం కొనుగోలు చేశారు. గతంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఐదేళ్లు పనిచేసిన అనుభవంతో అనాథలు, వికలాంగుల కష్టాలు తీరుస్తున్నారు.

ప్రకృతి ఒడిలో అమ్మ ప్రేమను అందిస్తున్న 'ఇచ్చా' సేవా సంస్థ

పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేసిన చిన్నారులతోపాటు... దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకురాని పిల్లలను మధు తుగ్నెట్‌ అక్కున చేర్చుకుంటారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిబంధనలు పాటిస్తూ.. న్యాయబద్ధంగా వారిని ప్రాంగణానికి తీసుకొస్తారు. పక్షులు, కుక్కలు, పిల్లులనూ ఆమె ఆశ్రమంలో పెంచుతున్నారు. వీటితో ఆడుకోవటం చిన్నారులకు మానసిక చికిత్స వంటిదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రకృతి ఒడిలో సంతోషంగా జీవిస్తున్నామని... కరాటే, ఆటలు, పాటలు నేర్చుకుంటున్నామని చిన్నారులు చెబుతున్నారు. అనాథులైన వికలాంగులకు ప్రభుత్వం పింఛను ఇవ్వకపోవటంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపాలని కోరారు.

ఎంతోమంది అనాథ పిల్లల గురించి తనకు సమాచారం వస్తున్నా... ఇప్పటివరకూ తను అక్కున చేర్చుకున్న పిల్లలను పూర్తిస్థాయిలో వ్యక్తిగతంగా చూసుకుంటేనే సంతృప్తిగా ఉంటుందని మధు చెబుతున్నారు.

ఇదీ చదవండి:సీఐడీ డీఐజీ సుమతికి కొవిడ్‌ వారియర్‌ అవార్డు

ABOUT THE AUTHOR

...view details