IAS Transfers in Telangana: రాష్ట్రంలో త్వరలోనే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే డీజీ స్థాయి సహా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం... కొందరు ఐఏఎస్‌లకు పదోన్నతులు కూడా కల్పించింది. మరికొందరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు కొనసాగింపుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు త్వరలోనే జరగనున్నాయి. వాస్తవానికి ఐఏఎస్ అధికారుల బదిలీల అంశం ఇప్పటికే పలుమార్లు తెరపైకి వచ్చింది.
నవంబర్ చివరి వారంలోనూ ఐఏఎస్‌ల బదిలీలపై జోరుగా చర్చలు జరిగాయి. సీఎం కేసీఆర్ కూడా ఐఏఎస్ అధికారుల బదిలీ విషయమై 2రోజులపాటు కొంతమంది మంత్రులతో కలిసి కసరత్తు చేశారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను బదిలీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఐఏఎస్‌ల బదిలీలు వాయిదాపడ్డాయి. ఓటర్ జాబితా సవరణ తుదిజాబితాను ఈసీ ఇవాళ ప్రకటించనుంది. దీంతో కలెక్టర్ల బదిలీకి అడ్డంకి తొలగిపోయింది.