గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఐఏఎస్ అధికారుల బదిలీ ఎట్టకేలకు జరిగింది. పురపాలక ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీల ప్రక్రియను సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 65 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం 50 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. 21 జిల్లాల కలెక్టర్లను మార్చింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకూ స్థానచలనం కలిగించింది.
2015-16 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు...
ఆయా జిల్లాల్లో సబ్ కలెక్టర్లు, ప్రత్యేక అధికారులుగా పనిచేస్తున్న 2015- 16 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులను ఇతర చోట్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా గౌతంపోత్రు, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ భవేజ్‌మిశ్రను నియమించింది. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా హనుమంతు కొండిబాను నియమించింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా రాహుల్ రాజ్, సంతోష్, ప్రియాంక, ప్రావీణ్యలకు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా వల్లూరు క్రాంతిని రామగుండం మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్‌ను నియమించారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జితేష్ వి పాటిల్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపికి బాధ్యతలు అప్పగించారు. బదిలీ చేసిన అధికారుల్లో కొంతమందికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.