హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం.. ఐఏఎంసీ సన్నాహక సదస్సు నేడు జరగనుంది. హెచ్ఐసీసీలో ఉదయం 10గంటల నుంచి సదస్సు జరగనుంది. సదస్సు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరు కానున్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలకోపన్యాసం, సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రసంగం ఇస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ప్రక్రియ, వినియోగదారుల అంచనాలు అనే అంశంపై జరిగే చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ పి.ఎస్.నర్సింహా, తదితరులు పాల్గొంటారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ ఉద్దేశాలపై చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ లైఫ్ ట్రస్టీ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ ప్రసంగిస్తారు.