తెలంగాణ

telangana

ETV Bharat / state

నార్మ్‌ సంస్థకు సర్దార్ పటేల్ పురస్కారం - hyderabad latest news

దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగం లక్ష్యంగా సేవలందిస్తున్న నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) ఓ మైలురాయి అధిగమించింది. దేశవ్యాప్తంగా ఎంపికైన వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తూ.. ఎన్నో ప్రభుత్వ విధానపరిమైన పథకాల రూపకల్పన, విధివిధానాలు రూపొందిస్తూ థింక్‌ట్యాంక్‌ సంస్థగా కేంద్రం గుర్తించిన నార్మ్‌ సంస్థకు అరుదైన పురస్కారం వరించింది.

నార్మ్
నార్మ్

By

Published : Jul 17, 2022, 4:50 AM IST

దేశంలో ఎన్నో ప్రభుత్వ విధానపరిమైన పథకాల రూపకల్పన, విధివిధానాలు రూపొందిస్తూ థింక్‌ట్యాంక్‌ సంస్థగా కేంద్రం గుర్తించిన నార్మ్‌ సంస్థకు అరుదైన పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక సర్దార్ పటేల్‌ పురస్కారం లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి 94వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు ఐసీఏఆర్ సర్దార్ పటేల్ పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ వేదికగా వ్యవసాయ రంగం, అన్నదాత సేవలో నిమగ్నమైన నార్మ్‌ సంస్థ.. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలుగా ఎంపికైన అభ్యర్థులను శాస్త్రీయపరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా భావిశాస్త్రవేత్తలు, సంస్థల అధిపతులు, విధాన రూపకల్పనకర్తలుగా తీర్చిదిద్దుతోంది. డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నార్మ్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకురావడం ద్వారా కేంద్రం మెప్పు పొందారు. ఇటీవల నార్మ్ పనితీరు పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సైతం ప్రశంసలు జల్లు కురిపించారు.

ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం వేళ... డాక్టర్ శ్రీనివాసరావుతోపాటు క్రీడా సంస్థ తరపున శాస్త్రవేత్త డాక్టర్ జీవీఎన్‌ఎస్ ప్రసాద్‌ బృందం కేంద్ర మంత్రి చేతుల మీదుగా వసంతరావు నాయక్ పేరట ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి సంరక్షణ, యాజమాన్యంపై చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కింది. గచ్చిబౌలి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) శాస్త్రవేత్త డాక్టర్ సోనూగాంధీ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పంజాబ్‌ దేశ్‌ముఖ్ పేరిట ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా హిరా మండలానికి చెందిన ఔత్సాహికపారిశ్రామికవేత్త, నారీశక్తి పురస్కార గ్రహీత పడాల భూదేవి కూడా ఐసీఏఆర్ పురస్కారం అందుకోవడం విశేషం.

వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతం కోసం మోదీ సర్కారు శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. దాదాపు 14 కోట్ల మంది రైతులు ఉండగా.. వీరిలో అధిక శాతం చిన్న,సన్నకారు రైతులే ఉన్న దృష్ట్యా 8 ఏళ్లుగా కేంద్రం తీసుకుంటున్న సానుకూల విధానాల వల్ల లక్షలాది మంది రైతుల ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి అన్నదాతలతో మమేకమై ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి తోమర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎన్‌కే సింగ్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సులోచన్ మహాపాత్ర, ఐసీఏఆర్ అనుబంధ జాతీయ సంస్థల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

KCR Fire On Central: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు

ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్దీప్ ధన్​కడ్

ABOUT THE AUTHOR

...view details