తెలంగాణ

telangana

ETV Bharat / state

Sajjanar on TSRTC: 'ఆర్టీసీని ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తా' - ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతానని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆర్టీసీ ఎండీగా బస్‌ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ అభివృద్ధిపై కొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని వెల్లడించారు.

Sajjanar
Sajjanar

By

Published : Sep 3, 2021, 4:36 PM IST

Updated : Sep 3, 2021, 5:33 PM IST

కరోనా వల్ల రవాణా, పర్యాటక రంగాలు దెబ్బతిన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధి విషయమై అధ్యయనం చేపడతామని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్​లో వేద పండితుల ఆశీర్వచనాలతో ఆయన విధులు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆర్టీసీకి చాలా ఏళ్లుగా ప్రభుత్వం సహకారం అందిస్తోందని సజ్జనార్‌ తెలిపారు. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని... సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ స్వావలంబనే లక్ష్యంగా ముందుకెళ్తామని సజ్జనార్‌ పేర్కొన్నారు. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్టీసీ ప్రస్తుత స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పని చేసినప్పుడు... ఎంతో మంది ఆర్టీసీ అధికారులతో కలిసిమెలిసి ఉన్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు సంస్థకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నాయని... ప్రతి రోజు 7 కోట్ల నష్టం వస్తోందని తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటు పరం కాదన్న ఆయన... ఆదాయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుందని... కరోనా సమయంలో ఇతర రాష్టాల్లో ఉద్యోగుల జీతాలు కట్ చేసినప్పటికీ, తెలంగాణలో పూర్తి జీతాలు అందాయన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.

'ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది. మనం ఏం చేయొచ్చు.. ఏం చేయొద్దు అనే దానిపై సమగ్రంగా స్టడీ చేసి... కొత్త యాక్షన్​ ప్లాన్ రూపొందిస్తాం. ప్రభుత్వంపై భారం కాకుండా... సొంతంగా నిలబడే విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తాం. అదే నా మొదటి ప్రయార్టీ. ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలు అందిస్తాం. ఆర్టీసీలో దాదాపు 48వేలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వాళ్ల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా.'

-సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

ఆర్టీసీ ఎండీగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్​ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. సైబరాబాద్ సీపీగా పనిచేసిన సజ్జనార్ ఇటీవలే ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి, రెవెన్యూ ఈడీ పురుషోత్తం నాయక్​లతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

ఇదీ చదవండి :నటి రకుల్‌ను 6 గంటలుగా విచారిస్తున్న ఈడీ అధికారులు

Last Updated : Sep 3, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details