Hyperboys riot మారణాయుధాలు, గంజాయితో సంచరిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి విశాఖ కంచరపాలెం ఊర్వశి కూడలి వద్ద మారణాయుధాలతో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశారు. ఓ ఆటో వద్ద నిందితులు దుంప రామకృష్ణ, అలమూరి కార్తిక్, నీలాపు శ్యామలరావు, నౌగణ సురేశ్‌పాల్, కొండపర్తి ఆకాశ్, దుంప రమణ, సిగణపురి చందు, లెక్కల జనార్దన్ మారణాయుధాలు, ఆరు కిలోల గంజాయితో కనిపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు.
హైపర్‌బాయ్స్ పేరిట దందా?
నిందితులు ‘హైపర్ బాయ్స్’ పేరిట ఓ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ బృందం బాధితుల పక్షాన కాకుండా మోసం చేసిన వారి పక్షాన నిలుస్తుంటుంది. నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వని సందర్భంలో బాధితులు ఎదురు తిరిగితే ఈ బృందం మోసగించిన వ్యక్తి తరఫున రంగంలోకి దిగుతుంది. మారణాయుధాలతో వారిని బెదిరించి సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తులు వీరికి కావాల్సిన మొత్తం ఇచ్చి ఈ తరహా సెటిల్‌మెంట్లకు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వడ్డీలకు ఇచ్చేవారు కొందరు తమకు అప్పులు వసూలు కాకపోతే ఈ బృందాన్ని సంప్రదిస్తారు. వీళ్లు రుణగ్రహీతలను బెదిరించి రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తమే రాబడతారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దాడులు చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: