తెలంగాణ

telangana

ETV Bharat / state

సమృద్ధిగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా అందించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ మాత్రలు రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు దేశ అవసరాలకు అనుగుణంగా కరోనా సంబంధిత ఉత్పత్తులకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది.

hydroxy chloroquine sufficient in state to treat patients
సమృద్ధిగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

By

Published : Apr 13, 2020, 8:35 AM IST

ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా అందించే హెచ్​సీక్యూ, అజిత్రోమైసిన్ మాత్రలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలోనే 13లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్‌, 36లక్షల అజిత్రోమైసిన్‌ మాత్రలు వేర్వేరు మోతాదుల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇవికాక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల ఉత్పత్తికి రాష్ట్రంలో 19 సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కరోనాకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌లో ఉన్నవాటితో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ ఔషధాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. రాజధానితో పాటు జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంది.

ఏ మాత్రలు ఎవరికి?

  • ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు ఇస్తున్నారు. ఈ మాత్రతో పాటు అజిత్రోమైసిన్‌నూ అందిస్తున్నారు.
  • కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, చికిత్సలో పాల్గొనే వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందికి సైతం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను నిర్దేశిత మోతాదులో ముందస్తు జాగ్రత్తగా ఇస్తున్నారు.
  • సాధారణ వ్యక్తులు వీటిని వైద్యుని సూచనలు లేకుండా వినియోగిస్తే.. అనారోగ్యం బారినపడే ప్రమాదముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్థానిక ఉత్పత్తులకు పెద్దపీట

రాష్ట్రంలో పరిస్థితులకు తగ్గట్లుగా కరోనా చికిత్సకు అవసరమయ్యే ఔషధాల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న సంస్థలను ప్రోత్సహిస్తోంది. గతంలో పెద్దఎత్తున ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, ఇటీవల ఆదరణ లేక తయారీని నిలిపివేసిన సంస్థలనూ ముందుకురావాలని కోరింది. దీంతో వారం రోజులుగా స్థానికంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తిపై రాష్ట్రంలో 19 సంస్థలు శ్రమిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రం నుంచే పెద్దఎత్తున ఈ మాత్రలను ఉత్పత్తి చేసి, ఇతర రాష్ట్రాలు, విదేశాల అవసరాలు సైతం తీర్చేందుకు వీలుగా ఉత్పత్తి పెంచాలని ఔషధ సంస్థలను ప్రభుత్వం కోరగా ఆ దిశగానే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఔషధ నియంత్రణాధికారులు తెలిపారు.

శానిటైజర్ల తయారీకి పచ్చజెండా

కొవిడ్‌-19కు ముందు 5 కంపెనీలే రాష్ట్రంలో శానిటైజర్లను ఉత్పత్తి చేసేవి. ఆల్కహాల్‌/ఇథనాల్‌ ఆధారితంగా వీటిని తయారుచేస్తారు. వీటిని చేతిలో ఒకట్రెండు చుక్కలు వేసుకొని రుద్దుకుంటే వైరస్‌ను చంపేస్తాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో చేతుల పరిశుభ్రత అత్యంత కీలకం కావడంతో శానిటైజర్ల కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన వాటి ఉత్పత్తికి ప్రభుత్వం 70 సంస్థలను అనుమతించింది. ఇందులో ఫార్మా సంస్థలే అధికంగా ఉన్నాయి.

అవసరాలకు సరిపడా తయారీ

ప్రభుత్వం అనుమతించడం వల్ల ఇటీవలే 170 కిలోల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ముడిసరకును ఉత్పత్తి చేసినట్లు సైమెడ్ ల్యాబ్స్ ఎండీ మోహన్​రావు తెలిపారు. తద్వారా 85వేల మాత్రల తయారీకి అవకాశముందని... ఇపుడున్న ఔషధాలకు మరిన్ని మాత్రలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా చికిత్స ఔషధాల నిల్వ

అనుమానితులకూ మాత్రలు

రాష్ట్రంలో కరోనా ప్రబలకుండా నియంత్రణ(కంటైన్‌మెంట్లు) ప్రాంతాలుగా గుర్తించిన 243 చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుంది. ఆ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని నిర్ధరించే ప్రక్రియను వైద్యసిబ్బంది ఇప్పటికే ప్రారంభించారు. అనుమానితులకు ముందస్తుగానే వ్యాధి నిరోధక మాత్రలను అందించాలని ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు విడుదల చేయడంతో.. ఆ మేరకు నూతన కార్యాచరణ రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం కరోనా చికిత్స, నివారణ చర్యల్లో పాల్గొంటున్న వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు... తదితర సిబ్బందికి ముందస్తుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఇస్తున్నారు. ఇకపై ఈ మాత్రల వినియోగ పరిధిని కంటైన్‌మెంటు ప్రాంతాల్లోని కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కూడా వర్తింపజేయాలని భావిస్తోంది. అయితే 15 ఏళ్ల లోపు పిల్లలు, గుండెకు సంబంధించిన పరీక్షల్లో ఈసీజీలో తేడా ఉన్నవారు, రెటినోపతి జబ్బుతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఈ మాత్రలను వినియోగిస్తే కొంత ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. వారిని మినహాయించాలని నిపుణులు సూచించడంతో.. ఆ మేరకు అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చింది. ఇందుకు గాను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షలకు పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను అన్ని జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పంపింది. ఈ ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలున్న వారిని ఇప్పటి వరకూ స్వీయ నిర్బంధంలో మాత్రమే ఉంచుతుండగా.. ఇక నుంచి వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఇవ్వడంతో పాటు నిర్ధారణ పరీక్షలను కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వ్యాధి రాకుండా నిరోధించడం, తీవ్రతను తగ్గించడంతో పాటు వ్యాప్తిని కూడా అడ్డుకున్నట్లు అవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.

పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంపు

ప్రస్తుతం రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, ఐపీఎం, ఫీవర్‌, నిమ్స్‌, ఎంజీఎం వరంగల్‌ తదితర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ రోజుకు 700 వరకూ నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఉంది. సీసీఎంబీలో మరో 300 వరకూ పరీక్షించవచ్చు. అయితే ప్రస్తుతమున్న పరీక్షల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రణాళికను వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే రూపొందించింది. రాష్ట్రంలోని ప్రస్తుతం అనుమతించిన అన్ని కొవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షల కేంద్రాల్లోనూ అత్యాధునిక పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న మాన్యువల్‌ పరీక్షల విధానాన్ని మార్చి, ఆ స్థానంలో ఆటోమెటెడ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 1500 వరకూ పెంచుకోవచ్చని వైద్యవర్గాలు తెలిపాయి. ఇవేకాకుండా భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ అత్యాధునిక ప్రయోగశాలలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇటీవల కేరళలో ప్లాస్మా థెరపీపై ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో.. రాష్ట్రంలోనూ గాంధీ వైద్యకళాశాలలో ఆ తరహా ప్రయోగాలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details