ఆదివారం ఉదయం హెచ్‌సీఏ స్టేడియం వద్ద హైడ్రామా నెలకొంది. ప్రత్యేక ఏజీఎం కోసం వచ్చిన శివలాల్, అర్షద్, వినోద్, శేష్ నారాయణ, జాన్ మనోజ్ సహా క్లబ్‌ల కార్యదర్శులను భద్రత సిబ్బంది స్టేడియం లోపలికి అనుమతించలేదు. దీంతో వారు స్టేడియం ప్రధాన గేటు ముందే టెంటు వేసుకుని, బ్యానర్ కట్టుకుని ప్రత్యేక ఏజీఎం నిర్వహించారు. జనవరి 10న ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు. అనంతరం అజహర్ వ్యవహారశైలిపై వారంతా విరుచుకుపడ్డారు.
‘‘75 ఏళ్ల హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేక ఏజీఎం ద్వారా ఎన్నికల తేదీని నిర్ణయించాం. జనవరి 10న ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సంపత్ ఈసారి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అజహర్ పదవీకాలం ముగిసినా తానే అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నాడు. రాజ్యాంగంపై అతనికి గౌరవం లేదు. చంద్రబాబు, వైఎస్‌లతో చర్చించి ఉప్పల్ స్టేడియానికి స్థలం ఇప్పించాం. దగ్గరుండి స్టేడియాన్ని నిర్మించాం. ఈరోజు మమ్మల్నే లోపలికి అనుమతించలేదు. హెచ్‌సీ చరిత్రలో ఇది చీకటి రోజు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి’’ - వినోద్, శివలాల్, అర్షద్
హెచ్‌సీఏలో ఏం జరుగుతోంది?:వర్గ పోరు, అధికార కాంక్షతో వివాదాలకు నిలయమైన హెచ్‌సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడిగా అజహరుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయిందని, హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేక ఏజీఎం నిర్వహించి హెచ్‌సీఏ పెద్దలు ప్రకటించారు. కానీ ఎన్నికలు జరగాలా వద్దా? అని నిర్ణయించాల్సింది ఎవరు? అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. హెచ్‌సీఏలో పాలన సవ్యంగా సాగడం కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ఛైర్మన్‌గా పర్యవేక్షక కమిటీ (ఎస్‌సీ)ని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే. అందులో ఐపీఎస్ అంజనీ కుమార్, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, వంకా ప్రతాప్ ఇతర సభ్యులుగా ఉన్నారు. కానీ ఈ ఎస్‌సీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదన్న విషయం ఇప్పటికే జస్టిస్ కక్రూ నివేదికతో స్పష్టమైంది.