ఏపీ పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే గేట్ల నిర్వహణకు అవసరమైన హైడ్రాలిక్ సిలిండర్లను నేరుగా పోలవరానికే రప్పించేందుకు జల వనరులశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిలిండర్లను సరఫరా చేసే కంపెనీ వాటిని పోలవరం ప్రాజెక్టు వద్దే పరీక్షించి చూపాలి. ఆ తర్వాతే వాటిని తీసుకునేలా చూస్తున్నారు. పోలవరంలో గేట్లు ఎత్తడం, దించడంలో హైడ్రాలిక్ సిలిండర్లదే కీలకపాత్ర. అవి జర్మనీ నుంచి రావాలి. సాధారణంగా అయితే పోలవరం ఉన్నతాధికారులు, గుత్తేదారు ప్రతినిధి బృందం జర్మనీ వెళ్లి వాటిని తనిఖీ చేసి ఆమోదించాలి.
కానీ కరోనా నేపథ్యంలో దీన్ని నిలిపివేసి, సిలిండర్లు ఇక్కడికే తెప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను గోదావరి వరద సమయంలోనూ కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా, ఇతర కారణాలతో ప్రాజెక్టులో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇంతలో గోదావరిలో ప్రవాహాలు పెరిగాయి. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తే స్పిల్ వే మీదుగా నీళ్లు ప్రవహిస్తాయి. ఆలోపు వరద నేరుగా గోదావరిలోనే సాగిపోతుంది. ఆగస్టులో 7-14 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు ఉంటాయని అంచనా.