తోటివారికి సాయపడాలన్న ఆలోచన మానవత్వాన్ని బతికించే ఓ మార్గం. హైదరాబాద్‌కు చెందిన ముజామ్మిల్ రిజ్వాన్ ఆ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లి ఓ వైపు చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో ఏదైనా ఉపాధి మార్గం గురించి ఆలోచించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా విజయవంతంగా నడిచేది.. ఫుడ్ బిజినెస్. అందుకే రిజ్వాన్ కూడా ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అందులో ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులకు ఉపాధి కల్పించారు. మరోవైపు విదేశాల్లో చదువుకోవాలని ఆలోచించేవారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలతో మమేకమై విద్యార్థులకు సలహాలు ఇస్తున్నారు. తన అనుభవాలను విద్యార్థులకు పాఠాల రూపంలో చెప్తూ.. స్ఫూర్తి నింపుతున్నారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఉపాధి మార్గం కోల్పోయిన భారతీయులకు తన రెస్టారెంట్లో ఉపాధి కల్పిస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో.. ఆస్ట్రేలియాలోని భారతీయులకు అండగా ఉంటున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి..
రకరకాల కారణాల వల్ల విదేశాల్లో చిక్కుకొని బాధితులుగా మారిన భారతీయులకు రిజ్విన్ ఆశాకిరణంగా మారారు. 2013లో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ విద్యార్థిగా ప్రస్థానం ప్రారంభించిన రిజ్వాన్ పిజ్జా డెలివరీ, గ్యాస్ స్టేషన్, సెక్యూరిటీ, ఉబర్ క్యాబ్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ సిడ్నీలోని ప్రముఖ విద్యా సంస్థ హెచ్‌బీడీ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ కౌన్సిలర్‌గా విద్యను పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎంతోమంది ఉర్దూ కవులను కలుసుకున్నాడు. రెస్టారెంట్ వ్యవస్థాపకుడిగా, కన్సల్టెంట్‌గా, కెరీర్ గైడ్‌గా మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాలో ఏదైనా కోర్సును పూర్తి చేయాలనుకునే వారికి భవిష్యత్తును తీర్చి దిద్దుకోవడానికి తనవంతు సహాయం చేస్తున్నాడు.
‘నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరిని సాయం అడగాలో తెలియదు. కనీసం చిన్న సలహా ఇచ్చేవారు కూడా ఉండేవారు కాదు. కానీ.. ఇప్పుడు మనవాళ్లకు నేనున్నాను. ‘నేను ఆస్ట్రేలియాకి వచ్చినప్పటి నుండి ఇక్కడ ఉన్న భారతీయులకు నాకు తోచిన సాయం చేస్తున్నాను. నా దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారికి అండగా ఉన్నా అనే సంతృప్తి నాకు చాలు’ అంటున్నారు రిజ్వాన్.
కమ్యూనిటీ సేవల విభాగంలో ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులచే రిజ్వాన్‌కు రెండుసార్లు అవార్డు లభించింది. ఇటీవల అంతర్జాతీయ విద్యార్థుల పట్ల ఆయన చేసిన కృషికి ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ స్వయంగా రిజ్వాన్‌ను ప్రశంసించారు. ప్రతి నాలుగు నెలలకోసారి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ, యువత ఉపాధి, కెరీర్‌కి సంబంధించిన ప్రేరణా ప్రసంగాలు ఇస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రణబ్ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు