కరోనా వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతున్న వేళ... వైరస్ నుంచి రక్షణ కోసం పౌర సమాజం రకకాల మాస్క్‌లను వినియోగిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించడంలో మాస్క్‌ల పాత్ర కీలకం కావడంతో ప్రభుత్వాలు తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేశాయి. సాధారణ మాస్క్‌లతో పోలిస్తే ఎన్ 95 మాస్క్‌లు ఖరీదు ఎక్కువ. కొవిడ్ ప్రారంభంలో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్ 95 మాస్క్‌లను మన దేశం దిగుమతి చేసుకుంది. కరోనా బాధితులకు అతిసమీపంలో ఉన్న వైద్యులతోపాటు అన్ని ఆస్పత్రులు, సిబ్బందికి అందుబాటులో ఉంచారు. కానీ సాధారణ పౌరులు కూడా ఎన్ 95 మాస్క్‌లు వాడుతుండటంతో కొరత ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన యువ ఇంజినీర్ వీరభద్రం... మేక్ ఇన్ ఇండియా నినాదంతో బాలనగర్‌లోని దక్షా మెడిటెక్ కంపెనీలో ఎన్ 95 మాస్క్‌లకు ప్రత్యమ్నాయంగా ఉండి పూర్తి రక్షణ కల్పించే మాస్క్‌లకు శ్రీకారం చుట్టాడు.
పునర్వినియోగించుకునేలా
ఎన్ 95 మాస్క్‌లో ఉన్న అన్ని అంశాలు తాను తయారుచేసే మాస్క్‌లోనూ పొందుపర్చాడు. 5 కీలక అంశాల ఆధారంగా మాస్క్‌లను తయారుచేసిన వీరభద్రం... తన స్నేహితురాలు దీప్తి సాయంతో వాటిని పునర్వినియోగం చేసుకునేలా సరికొత్తగా తీర్చిద్దాడు. మనం సాధారణంగా వాడే మాస్క్‌లు నూటికి నూరు శాతం కొవిడ్ నుంచి రక్షణ కల్పించలేవని గుర్తించిన దీప్తి, వీరభద్రం... వాటికి పీఎం 2.5 ఫిల్టర్ పేపర్, రెసిప్రేటరీ వాల్వూను జోడించారు. టెక్స్ టైల్ ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో కాపర్ ఇంపెగ్ర్నేషన్ పద్ధతిలో మాస్క్ ముందుభాగాన్ని కాపర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు.