తెలంగాణ

telangana

ETV Bharat / state

బాక్సింగ్ 'అర్చన': ఆమె కిక్​ ఇస్తే.. పతకం వచ్చినట్టే! - బాక్సర్ అర్చన వార్తలు

'కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి' అనే అబ్దులు కలాం మాటలనే స్ఫూర్తిగా తీసుకుంది. కష్టపడితే సాధించలేనిది ఏది లేదంటూ బాక్సింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. అమ్మాయినైతే ఏంటీ? పంచ్‌తో ప్రత్యర్థిని మట్టి కరిపించి.. పతకాలు పట్టుకొస్తానంటోంది. అసాధారణ ప్రతిభతో... రాష్ట్రస్థాయిలో మెడల్స్‌ సాధించింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని ముద్దాడింది.

boxer archana
boxer archana

By

Published : Nov 17, 2020, 5:38 PM IST

Updated : Nov 17, 2020, 6:43 PM IST

బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ... పతకాల వేటలో హైదరాబాదీ

హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉండే శ్రీకాంత్, స్మిత దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి మల్లేశ్వర్, అమ్మాయి అర్చన. ఎనిమిదో తరగతి నుంచే అర్చనకు బాక్సింగ్‌పై మక్కువ ఏర్పడింది. మగవాళ్లు ఎక్కువగా ఆడే ఆటను ఎంచుకున్నావని.. మొదట తల్లిదండ్రులు వారించినా.. కుమార్తె ఆసక్తి గమనించి... ప్రోత్సహించడం ప్రారంభించారు. అలా రింగ్‌లోకి అడుగు పెట్టిన అర్చన.. పూర్తిస్థాయిలో ఆటపై పట్టు సాధించింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అర్చన.. జాతీయస్థాయిలో ఐదు పతకాలతోపాటు.. రాష్ట్రస్థాయిలో 14, జిల్లా స్థాయి పోటీల్లో 24 పతకాలు సాధించింది.

ఆడుతూనే చదువు...

2013లో ఎల్బీ స్టేడియంలో వేసవి శిబిరం ప్రారంభించినప్పుడు మరింత మెరుగైన శిక్షణ పొందేందుకు ఆ క్యాంపులో చేరింది. అక్కడి కోచ్ ఓంకార్‌నాథ్ వద్ద శిక్షణ తీసుకుంటూనే.. వ్యక్తిగత కోచ్‌ నరేష్‌ వద్ద మెళకువలు నేర్చుకుంది. 2017లో రాజస్థాన్‌లో జరిగిన పోటీల్లో కాంస్య పతకంతోపాటు తాజాగా నవంబర్‌ 8న ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఓవైపు ఆటపై పట్టుసాధిస్తూనే.. చదువును కొనసాగిస్తోంది.

సహకరిస్తే... పతకాలే

బాక్సింగ్‌లో తమ కుమార్తె అద్భుత ప్రతిభ కనబరుస్తోందని.. కానీ పోటీలకు పంపేందుకు తమ వద్ద ఆర్థిక స్తోమత లేదని అర్చన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ.. ఎక్కడా వెనకడుగు వేయకుండా.. ముందుకెళ్తున్నానని అర్చన అంటోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే.. దేశం కీర్తి పెరిగేలా మరెన్నో పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి :వైరల్: బెట్టింగ్ పైసలివ్వలేదని కర్రతో చితకబాదిండు!

Last Updated : Nov 17, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details