Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్ గాంధీనగర్‌లోని నాలాలో.. ఆదివారం గల్లంతు అయినట్లు (Hyderabad Woman Missing in Nala) అనుమానిస్తున్న లక్ష్మి అనే మహిళ కోసం.. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. గల్లంతైనట్లు భావిస్తున్న పరిసర ప్రాంతాల నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర హుస్సేన్‌సాగర్ సర్ప్రైస్ నాలా, మూసీలో, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి మహిళా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Missing: ఉత్తరాఖండ్‌లో నదిలో పడిన పర్యాటకుల వాహనం.. తెలుగు వ్యక్తి గల్లంతు
మరోవైపు 24 గంటలైనా అధికారులు లక్ష్మి ఆచూకీని గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ తల్లిని గుర్తించడంలో జరుగుతున్న జాప్యంపై.. ఆమె కుమార్తెలు సునీత, సుజాత, సుకన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంలో జరిగిన ఆలస్యం కారణంగానే ఈ ఘటనచోటుచేసుకుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
"ఆదివారం మధ్యాహ్నం నుంచి మా అమ్మ కనిపించడంలేదు. ఏమైందోఅని భయంగా ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా అమ్మ అచూకీ గుర్తించాలని కోరుతున్నాం." - లక్ష్మి, కుమార్తెలు
ఈ నేపథ్యంలోనే గాలింపును తీవ్రతరం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దామోదర సంజీవయ్య నగర్ నుంచి నాగోల్ వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు గాంధీనగర్ డివిజన్ ఏసీపీ రవికుమార్ తెలిపారు. అయితే సదరు మహిళ ప్రవహిస్తున్న నాలాలో గల్లతైందో.. లేదో అని అనుమానంగా ఉన్నట్లు ఏసీపీ రవికుమార్ వివరించారు.