తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్షణ రంగ ఉత్పత్తుల తయారీపై హైదరాబాదీ ముద్ర..! - హైదరాబాద్​ తాజా వార్త

భాగ్యనగర వేదికగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కొలువు తీరాయి. రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. 101 ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బహుముఖంగా విశ్వనగరంలో పరిశ్రమలు విస్తరించనున్నాయి.

Hyderabad will be the venue for the manufacture of defense products
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీపై హైదరాబాదీ ముద్ర

By

Published : Aug 11, 2020, 7:25 AM IST

Updated : Aug 11, 2020, 11:50 AM IST

బీడీఎల్‌, ఆర్‌సీఐ, మిధాని, డీఆర్‌డీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, ఎన్‌ఎఫ్‌సీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దేశ రక్షణ రంగానికి కీలకమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇవి అందిస్తున్నాయి. మనదేశ రక్షణ ఉత్పత్తుల చిత్రపటంలో ఈ విధంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల సారథ్యంలో ప్రైవేటు రంగంలో ఎన్నో చిన్న, మధ్యతరహా యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఆస్ట్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌, అవాంటెల్‌, జెన్‌ టెక్నాలజీస్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ కోవలోకి వచ్చే కంపెనీలే. ఇవి కాకుండా దేశీయంగా అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలకు చెందిన రక్షణ ఉత్పత్తుల యూనిట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, సాబ్‌ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ డ్యూపాంట్‌ బాలిస్టిక్స్‌ ఫెసిలిటీ, నేషనల్‌ బెలూన్‌ ఫెసిటిలీ (టీఐఎఫ్‌ఆర్‌- ఇస్రో సంయుక్త సంస్థ), కల్యాణి ఫోర్ట్‌... వంటివి ముఖ్యమైనవి. సమీప భవిష్యత్తులో ఈ సంస్థలు మనదేశ భద్రతకు ఆయువు పట్టు కాబోతున్నాయి. రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణకు శ్రీకారం చుట్టటమే దీనికి కారణం. ఇందువల్ల రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ హైదరాబాద్‌లో బహుముఖంగా విస్తరించనుంది.

దశల వారీగా దిగుమతుల నిలిపివేత

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 7న ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి రెండేళ్ల కాలంలో ఈ వస్తువుల దిగుమతులను క్రమంగా నిలుపుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

● ఇందులో మర ఫిరంగుల నుంచి అసాల్ట్‌ రైఫిల్స్‌, సిమ్యులేటర్లు, లైట్‌ కంబాట్‌ హెలీకాఫ్టర్లు, రాడార్లు... ఇలా పలు రకాల ఉత్పత్తులున్నాయి. ఈ ఉపకరణాలు తయారు చేసే ఎన్నోసంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ సంస్థలకు ఇక ఆకాశమే హద్దుగా అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

● ఆకాష్‌, నాగ్‌ వంటి క్షిపణిలను, వరుణాస్త్ర (టోర్పెడో), ఎంఆర్‌సామ్‌ (మీడియమ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌) వంటి పలు రకాల ఆయుధాలను బీడీఎల్‌ (భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌) తయారు చేస్తోంది. రాడార్లు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను తయారు చేసే సంస్థ ఈసీఐఎల్‌, అణు ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థగా ఎన్‌ఎఫ్‌సీ (న్యూక్లియర్‌ ఫ్లూయల్‌ కాంప్లెక్స్‌) హైదబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

● ప్రైవేటు రంగంలోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సిరోస్కి హెలీకాఫ్టర్లకు కేబిన్లు తయారు చేస్తోంది.

● దేశంలోనే అతిపెద్దదైన అదాని ఏరోస్పేస్‌ పార్క్‌ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటైంది.

● యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ ఏరోస్పేస్‌ వెహికల్స్‌) లను స్థానిక కంపెనీలైన సైయెంట్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తయారు చేసి రక్షణ రంగానికి సరఫరా చేస్తున్నాయి.

● సిమ్యులేటర్ల తయారీలో స్థానిక కంపెనీ అయిన జెన్‌ టెక్నాలజీస్‌ పాతికేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మారిన కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశీయ ఆయుధ రంగంలో ఈ సంస్థలన్నీ కీలక పాత్ర పోషించవచ్ఛు

● అత్యధికంగా ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు నడుం కట్టింది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, కట్టుదిట్టంగా ఈ మార్గంలో ముందుకు సాగితే వచ్చే దశాబ్దకాలంలో మనదేశం రక్షణ ఉత్పత్తులను పెద్దఎత్తున ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని స్థానిక రక్షణ ఉత్పత్తుల నిపుణులు పేర్కొంటున్నారు.

అందులో 9 ఉత్పత్తులు మావే

దిగుమతులు నిలిపివేస్తున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించిన 101 పరికరాల జాబితాలోని 9 రకాల పరికరాలను తాము ఎంతో ఎంతోకాలంగా తయారు చేస్తున్నట్లు హైదరాబాద్‌ కంపెనీ అయిన జెన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ‘101 పరికరాల్లో 9 రకాల సిమ్యులేటర్లు ఉన్నాయి. వీటి డిజైన్‌- అభివృద్ధి, తయారీ కోసం ఎంతోకాలంగా మేం పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి, ఆయా ఉత్పత్తులను రక్షణ బలగాలకు అందిస్తున్నాం’ అని జెన్‌ టెక్నాలజీస్‌ ఎండీ అశోక్‌ అట్లూరి పేర్కొన్నారు. ఇకపై తమ సంస్థకు అధికంగా తయారీ- సరఫరా కాంట్రాక్టులు లభిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి:నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Aug 11, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details