Telangana Weather report: తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.ఈ రోజు దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. నిన్న విదర్భ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు.
నిన్న అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారింది. రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుపానుకు అసనిగా నామకరణం చేశారు. మే10న ఒడిశా తీర ప్రాంతం, ఏపీలోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుందని అధికారులు తెలిపారు.