తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదాయం వైపు జలమండలి చూపు.. - hyderabad water board updates

ఆదాయం పెంపు మార్గాలపై హైదరాబాద్ జలమండలి దృష్టి సారించింది. దీనికోసం నగరంలో ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టనుంది. సర్వే విధానానికి సంబంధించి పలు అంశాలపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. గ్రేటర్​లో ఇంటింటికి వెళ్లి క్యాన్ నంబర్ ఆధారంగా సర్వే చేసి.. నివాస కనెక్షన్ ఉండి వాణిజ్య కార్యకాలాపాలకు వినియోగిస్తున్న భవనాల గుర్తించాలని జల మండలి ఎండీ దానకిశోర్ ఆదేశాలు జారీచేశారు.

జలమండలి

By

Published : Oct 12, 2019, 6:36 AM IST

Updated : Oct 12, 2019, 9:10 AM IST

ఆదాయం వైపు జలమండలి చూపు.
హైదరాబాద్ జలమండలి రెవెన్యూ పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. బోర్డు సిబ్బందితో నగరంలో ఇంటింటి సర్వే చేపట్టడానికి ఏర్పాట్లు చేసింది. సర్వేకు సంబంధించిన అంశాలపై ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది సిబ్బంది 50 బృందాలుగా ఏర్పడి జీఎం, డీజీఎం, మేనేజర్ సాయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కస్టమర్ నంబర్, మీటర్ వివరాలు, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ వంటి వాటిపై వివరాలు సేకరించనున్నారు.

11 డివిజన్లలో

నివాస యోగ్యానికి నల్లా కనెక్షన్ ఉండి ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే వాణిజ్య కేటగిరీలోకి మార్పు చేస్తారు. ఈ ఇంటింటి సర్వే మొదట నగరంలోని 5 నుంచి 7 వరకు, 9 నుంచి 11 డివిజన్ల పరిధిలో చేపడుతారు. అనంతరం నగర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తారు.జలమండలి మొత్తం రెవెన్యూ నెలకు రూ.120 కోట్లు రాగా... ఖర్చు నెలకు రూ.150 కోట్లు వస్తుందని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రతి నెల రూ.30 కోట్ల నష్టం వస్తుందన్నారు. లోటులో ఉన్న బోర్డు ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో సిబ్బంది ఇంటింటికి వెళ్లి బోర్డు నిబంధనలకు అనుగుణంగా కనెక్షన్ ఉందా లేదా, అక్రమ నల్లా కనెక్షన్ గుర్తింపు, వాటిని రెగ్యూలైజ్ చేయడం, నాన్ డొమెస్టిక్ కనెక్షన్ అయితే మీటర్ బిగింపు, నీటి వృథా అరికట్టడానికి అవగాహన కల్పించడం వంటి వాటిపై సర్వే చేపట్టాలని సూచించారు.

నీటి వృథా

నీటి వృథాను అరికడితే బోర్డుకు మరింత ఆదాయం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. బోర్డు పరిధిలో దాదాపు పది లక్షల ఆరువేల కనెక్షన్లు ఉండగా వాణిజ్య కనెక్షన్లు మాత్రం 30 వేలు ఉన్నాయని తెలిపారు. గతంలో డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని ప్రస్తుతం వాణిజ్య సముదాయాలకు వాడుతున్నారన్నారు. సర్వే సిబ్బంది వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని.. సర్వే తర్వాత ఈ వివరాలపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సర్వేలో అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: "ఈఎస్​ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!

Last Updated : Oct 12, 2019, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details