అదో ప్రభుత్వ పాఠశాల(schools in Hyderabad).. అయితేనేం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలకు వేదికగా మారింది. వ్యర్థాలు నిండితే సమాచారమిచ్చే చెత్త కుండీ.. ఎక్కడినుంచైనా ఫ్యాన్లు, దీపాలు ఆఫ్/ఆన్ చేసే ప్రత్యేక వ్యవస్థ.. ప్రమాదకర వాయువులను గుర్తించి అప్రమత్తం చేసే పరికరం.. ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న విజయ్‌నగర్‌కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government School Hyderabad) ఆవిష్కరణలు అబ్బురపరుస్తున్నాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోంది. పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు పడాల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. వీరికి మరో ఉపాధ్యాయురాలు సుమలత సహకారం అందిస్తున్నారు. లెర్నింగ్ లింక్స్, మైక్రోచిప్ వంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయి.
చెత్త నిండితే బజర్..
రోడ్ల పక్కన చెత్తకుండీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు. చెత్తకుండీపై ప్రత్యేకంగా అమర్చిన సెన్సార్ ద్వారా వ్యర్థాలు నిండితే వెంటనే సందేశం అందుతుంది. ప్రతి డస్ట్‌బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన సెన్సార్ సాయంతో ప్రత్యేక ఎల్‌ఈడీని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. చెత్తకుండీ నిండగానే ఈ ఎల్‌ఈడీ వెలగడంతో పాటు బజర్ శబ్ధం వస్తుంది.
ఎక్కడి నుంచైనా ఆన్/ఆఫ్..
ఇల్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు, దీపాలు కట్టేయకుండా మరిచిపోతుంటాం. విద్యుత్తు వృథాతో పాటు బిల్లులూ భారీగా వస్తుంటాయి. దీన్ని అధిగమించేందుకు హైవైఫై ల్యాబ్‌ను తయారు చేశారు. ప్రత్యేకంగా అమర్చిన సెన్సార్ బోర్డు సాయంతో ఈ ల్యాబ్‌ను తయారు చేశారు. దీన్ని స్విచ్‌బోర్డుకు అనుసంధానం చేశారు. చరవాణిలో అలెక్సా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, హైవైఫై ల్యాబ్‌తో అనుసంధానించారు. ఫ్యాన్లు, దీపాలు ఆన్/ఆఫ్ చేసుకునే వీలవుతోంది. కేవలం ఇంటర్‌నెట్ (వైఫై) కనెక్షన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వాటిని నియంత్రించేందుకు వీలువుతుందని విద్యార్థులు చెబుతున్నారు.
గ్లాసుకు తగ్గట్టుగా నీరు..
కుళాయిల వద్ద గ్లాసుకు సరిపడా నీరు పట్టుకుని తర్వాత ఆగిపోతే నీటి వృథాను నియంత్రించే వీలవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్మార్ట్ వాటర్ వెండింగ్ మెషిన్ తయారు చేశారు. ట్యాప్ వద్ద నాలుగు సెన్సార్లు అమర్చారు. ఇవి మనం పెట్టే గ్లాస్ ఎత్తును గుర్తించి అందుకు తగ్గట్టుగా నీటిని విడుదల చేసి నిలిపేస్తాయి.