Hyderabad Traffic Challan : వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుంది. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ-చలాన్‌లు అందుకుంటూ.. వాటిని భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వదిలేసిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఊరట కల్పించనున్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా రాయితీలు ఇవ్వనున్నారు. ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా కొందరు చెల్లిస్తున్నారు, మరి కొందరు వదిలేస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ.600 కోట్లకు చేరింది.
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై అధికారులు దృష్టి సారించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులపై ఉన్న పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించే అవకాశం కల్పిస్తూ అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. దస్త్రాన్ని డీజీపీకి పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేశారు. అయితే, డీజీపీ మహేందర్‌రెడ్డి రెండు వారాలపాటు సెలవుపై వెళ్లడంతో దస్త్రం పెండింగ్‌లో ఉంది. డీజీపీ మహేందర్‌రెడ్డి విధుల్లో చేరగానే రాయితీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే, ఎంత మేర రాయితీ ఇస్తారనే దానిపై వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ద్విచక్ర వాహనదారులకు 75శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం రాయితీ ఇచ్చి.. ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అనుమతిస్తారని తెలుస్తోంది. అయితే, ఎంత మొత్తం రాయితీ ఇస్తారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
వాళ్లకు నాంపల్లి కోర్టు ఊరట