నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో దేశంలోని ఇతర నగరాలకన్నా జీహెచ్ఎంసీ అగ్రస్థానంలో ఉంది. ఒక్కొక్క చిరు వ్యాపారికి రూ.10వేల తక్షణ సాయం అందించడంలో భాగంగా రికార్డు స్థాయిలో 34,878 మందికి అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.
34,878 మందికి రుణాలు
2020 జులై 2న ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 1,62,105 మంది చిరువ్యాపారులను గుర్తించగా వీరిలో 1,57,945 మంది చిరువ్యాపారుల వివరాలను మెప్మా పోర్టల్లో అప్ లోడ్ చేశారు. 1,54,335 మంది చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీచేశారు. ఈ చిరువ్యాపారుల్లో ఒకొక్కరికి రూ.10వేలు తక్షణ సాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా 67,233 మంది అప్లై చేసుకున్నారు. అర్హులైన 42,911 మందికి రుణాలు మంజూరు కాగా నేటి వరకు 34,878 మందికి రుణాలను అందించడం ద్వారా దేశంలోని ఇతర నగరాలకన్నా గ్రేటర్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.