Hyderabad Sub Inspector Drugs Case Update :నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలతో ఏకంగా సైబర్ క్రైమ్ ఎస్సైపట్టుబడటం.. పోలీసుల వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ.. డ్రగ్స్, గంజాయి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే.. ఖాకీలే ఇలాంటి పనులు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని, ఎప్పట్నుంచి జరుగుతున్నాయి..? ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు? వెనకాల అధికారుల సాయముందా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Hyderabad Sub Inspector Arrested for Drugs Supply : ఇక.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై రాజేంద్రవిషయానికొస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురు కానిస్టేబుళ్లు సహా ఎస్సై.. మహారాష్ట్రలోని కందేశ్వర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సైబర్ నిందితుడిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో కలిసి వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న నైజీరియన్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై రాజేంద్ర(SI Rajendra Arrest) లోపలకు వెళ్లారు. ముగ్గురు కానిస్టేబుళ్లు గది బయటే ఉండిపోయారు.
Telangana SI Arrested for Selling Drugs :గదిలో ఉన్న ఇద్దరు నైజీరియన్ల వద్ద సుమారు 5 కిలోల మాదకద్రవ్యాలు లభించాయి. నిందితుల్లో ఒకరు తప్పించుకున్నాడు. మరొకరిని అదుపులోకి తీసుకుని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. గదిలో దొరికిన మాదకద్రవ్యాల్లో 1,750 గ్రాముల మెథకొలిన్‌ను రాజేంద్ర తన వద్దనే దాచుకున్నాడు. మణికొండ శ్రీనివాస్‌కాలనీలోని తన నివాసంలో భద్రపరిచాడు.
6 నెలలుగా డ్రగ్స్ సరఫరా చేసే ఏజెంట్లు, దళారులతో మెథకొలిన్ విక్రయించేందుకు మంతనాలు జరిపాడు. ఇటీవల టీఎస్ న్యాబ్‌కు పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ వద్ద లభించిన సెల్‌ఫోన్‌తో గుట్టు బయటపడింది. వాట్సాప్ ఛాటింగ్‌లో పెద్దఎత్తున మాల్ ఉందనే విషయాన్ని టీఎస్ న్యాబ్ అధికారులు నిర్ధారించుకున్నారు. డెకాయ్ ఆపరేషన్‌తో డ్రగ్ పెడ్లర్ మాదిరిగా ఛాటింగ్ చేసి.. రాజేంద్రను సరుకుసహా బయటకు రప్పించి అరెస్ట్ చేసి.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రను అదుపులోకి తీసుకునేంత వరకూ డ్రగ్స్ విక్రయానికి సిద్ధమైన వ్యక్తి.. పోలీస్ అధికారి అనే విషయం గుర్తించలేకపోవటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.